Spread the love

సాంకేతిక విప్లవం.. అన్ని రంగాల్లో భారీ  మార్పులు తీసుకొచ్చింది. సేద్యం ఇందుకు మినహాయింపేం కాదు. గతంలో స్వేదమే ప్రధాన పెట్టుబడిగా ఉన్న వ్యవసాయంలో… నేడు ఎన్నో ఆధునిక పద్ధతులు ఆవిష్కృతం అయ్యాయి. రైతు శ్రమని, కూలీల ఖర్చుని తగ్గించి.. అధిక దిగుబడులు ఇచ్చే అనేక ఆధునిక యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. విత్తనం వేసింది మొదలు.. పంటలు కోసే వరకు ఉపయోగించే వివిధ రకాల వ్యవసాయ యంత్రాలను అనేక మంది ఔత్సాహిక శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాత అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఆధునిక సాగు పరికరాలపై రైతులకు అవగాహన పెంచేందుకు “రైతునేస్తం ఫౌండేషన్” జూన్ 10న వ్యవసాయ యంత్ర పరికారల ప్రదర్శన నిర్వహించింది. గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కేంద్రంలో ఈ ప్రదర్శన జరిగింది. ఆధునిక సాగు యంత్రాల రూపకర్తలు ప్రొఫెసర్ ముప్పా లక్ష్మణ రావ్, పలమనేరు ప్రకాశ్, బొమ్మగాని మల్లేశ్, సయ్యద్ సుభాణి, దమరసింగి బాబు రావు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. వారి ఆవిష్కరణలను ప్రదర్శించడటంతో పాటు అవి పనిచేసే విధానాలు, రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు.

ఖర్చు తక్కువ.. ప్రయోజనం అధికం

రైతులే శాస్త్రవేత్తలుగా మారి తోటి రైతుల అవసరాలకు అనుగుణంగా అధునాతన యంత్ర పరికరాలు రూపొందించారు. వాటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. వీడర్స్, సైకిల్ వీడర్స్, మల్టీ పర్పస్ స్ప్రేయర్స్, మల్టీ పర్పస్ వీడర్స్, మినీ వీడర్, సోలార్ స్ప్రేయర్, ఆర్గానిక్ డిస్పెన్సర్, నానో స్ప్రేయర్, మల్టీ పర్పస్ డ్రమ్ సీడర్ తదితర ఆధునిక పరికరాలను రైతులకు

పరిచయం చేయడంతో పాటు అవి ఎలా పనిచేస్తాయి.. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే అంశాలపై అవగాహన కల్పించారు. ఏ పంటలకు ఎలాంటి పరికరాలు వాడాలో తెలియజేశారు. తమ ఆవిష్కరణలను అన్నదాతలకు పరిచయం చేసేందుకు రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన.. చక్కని వేదికగా నిలిచిందని యంత్ర పరికరాల రూపకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రైతుల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు.

ప్రదర్శన ఉపయోగకరం : రైతులు

కూలీల కొరత, పెరిగిన కూలీల ఖర్చుల నేపథ్యంలో సాగులో యంత్ర పరికరాల వినియోగం తప్పనిసరిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఎంతో ఉపయుక్తంగా ఉందని రైతులు తెలిపారు. దుక్కి దున్నింది మొదలు, విత్తనం వేయడం, కలుపు తీయడం, ఎరువులు, ద్రావణాలు స్ప్రే చేయడం, పంట కోయడం వంటి పనులను సులువుగా పూర్తి చేసే యంత్రాల గురించి తెలుసుకున్నామని, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను అర్ధం చేసుకున్నామని వెల్లడించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మేలు జరిగే పద్ధతులను, విధానాలను ఈ ప్రదర్శన ద్వారా తెలుసుకున్నామని, వ్యవసాయంలో ఆధునిక మార్పులను రైతులకు పరిచయం చేసేందుకు రైతునేస్తం ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.

తక్కువ ఖర్చుతో చేసే ప్రకృతి వ్యవసాయంలో ఆధునిక యంత్ర పరికరాలు రైతులకు బాగా ఉపయోగపడతాయని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు అన్నారు. జీవామృతం , నీమాస్త్రం తదితర సహజ ఎరువులను పంటలకు అందించేందుకు ఇవి ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. రైతుల అవసరాలను గుర్తించి ప్రభుత్వం వారికి రాయితీలో ఆధునిక యంత్ర పరికరాలను అందించాలని కోరారు.