Spread the love

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం వల్ల రైతుల ఆదాయాన్ని పెంచవచ్చని నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది. ఉపాధి హామీని సేద్యానికి అనుసంధానించడంపై అధ్యయనం చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రులతో జాతీయ స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద పలు రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఉపయోగపడేలా చేపడుతున్న పనులను వివరిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, నీతి ఆయోగ్‌లు నివేదిక తయారు చేశాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పనుల వివరాలను సైతం ఇందులో ప్రస్తావించారు.

వివరాలివీ…

– రైతులకు ఉపయోగపడే గోదాములు, పొలాల్లో నీటిగుంతలు, అడ్డుకట్టలు వంటి మౌలిక సదుపాయాల వృద్ధి పనులు చాలా అవసరం. వ్యవసాయమే కాకుండా దాని అనుబంధ రంగాలకు ఉపయోగపడేలా మౌలిక సదుపాయాల పనులు చేపట్టవచ్చు.

– గొర్రెలు, పాడి పశువుల సంరక్షణ పందిళ్ల నిర్మాణం, కోళ్ల ఫారాలు. పంటలు కోసిన తరవాత మిగిలే వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ రోడ్లు, మురుగుకాల్వలు వంటివాటినీ నిర్మించాలి. ఉదాహరణకు తమిళనాడు, ఒడిశాల్లో రైతులకు ఉపయోగపడేలా ఉల్లిగడ్డల నిల్వకు గోదాములను నిర్మించారు. ఇలా నిల్వ చేసిన వాటికి కిలోకు రూ.10 చొప్పున మద్దతు ధర వచ్చేలా చూడటం వల్ల రైతుల ఆదాయం పెరిగింది.

– ఉపాధి హామీ పథకానికి కేటాయించే నిధుల్లో కనీసం 60 శాతం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు ఉపయోగపడే పనులు చేపట్టేందుకే వినియోగించాలి.

– వ్యవసాయానికి తోడ్పడేలా 164 రకాల పనులు చేపట్టవచ్చు.

– గత మూడేళ్లలో సాగునీటి సంరక్షణ పనుల వల్ల కోటి 43 లక్షల హెక్టార్లకు ప్రయోజనం కలిగింది.

– గతేడాది (2017-18)లో ఉపాధి హామీ కింద మొత్తం 8.66 లక్షల పనులు పూర్తిచేయగా అందులో పొలాలకు సాగునీటిని అందించే నీటిగుంతల నిర్మాణాలే 4.84 లక్షలున్నాయి. గొర్రెలు, పాడి పశువులు, కోళ్ల ఫారాలకు ఉపయోగపడే 1.55 లక్షల పందిళ్లు నిర్మించారు.

– వ్యర్థాలతో ఎరువుల తయారీ కేంద్రాలను సైతం నిర్మించడానికి ఈ పథకాన్ని వినియోగించాలి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో ‘చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం’ నిర్మించడం ఇందుకు ఉదాహరణ. ఇదే రాష్ట్రంలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రామలింగాయపల్లిలో పట్టుగూళ్ల ఉత్పత్తి కేంద్రం సైతం నిర్మించారు.

– తమిళనాడులో పాల రైతుల సహకార సంఘం భవనాలను ఉపాధి హామీ కింద ఆధునాతన సదుపాయాలతో నిర్మించారు.

– తెలంగాణ, కర్ణాటకల్లోని గ్రామాల్లో పశువులకు తాగునీటి ట్యాంకులు నిర్మించారు. ఆదిలాబాద్‌ జిల్లా కామగిరి గ్రామంలో ట్యాంకు నిర్మాణం వల్ల పశువులకు తాగునీటి సదుపాయం ఏర్పడింది.

– సేంద్రియ వ్యవసాయాన్ని పెంచేందుకు 2.19 లక్షల వానపాముల ఎరువుల తయారీ గుంతలను గతేడాది నిర్మించారు.

– భూముల చుట్టూ కంచెల నిర్మాణం, భూముల అభివృద్ధి, బీడు భూముల్లో పండ్ల మొక్కలు, గడ్డి పెంపకం వంటి పనులు చేయవచ్చు.

– బిందు సేద్యం, ఎండిపోయిన బోరుబావుల పునరుద్ధరణకు ఇంకుడు గుంతల నిర్మాణాలూ చేపట్టాలి.

– భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్‌) ఆధ్వర్యంలో సాధారణ పంటల సాగు నుంచి ఆదాయం అధికంగా వచ్చే కొత్త పంటల సాగువైపు రైతులను మళ్లించేందుకు పనులు చేపట్టాలి.

– ఉపాధి హామీ కింద మరిన్ని మార్కెట్లు నిర్మించాలి.

– కంపెనీల లాభాల్లో 2 శాతం సొమ్మును సామాజిక అభివృద్ధికి ఇస్తున్నారు. వాటిని ఉపాధి హామీ ద్వారా వ్యవసాయ రంగానికి ఉపయోగపడే మౌలిక సదుపాయాల కల్పన పనులకు వినియోగించాలని సైతం నీతి ఆయోగ్ నివేదికలో సిఫార్సు చేసింది.