Spread the love

రైతుకు పెట్టుబడి సాయానికి ప్రభుత్వం ‘అన్నదాతా సుఖీభవ’ పథకాన్ని ప్రకటించింది. ఇందుకోసం 2019-20 బడ్జెట్లో రూ.5,000 కోట్లు కేటాయించింది. అప్పుల ఊబిలో ఉన్న కర్షకులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు 2014లో సర్కారు రూ.24 వేల కోట్లతో రుణ ఉపశమన పథకాన్ని ప్రకటించిన విషయం విదితమే. ఇప్పటికి మూడు విడతల్లో రూ.15,147 కోట్లు ఇచ్చింది. త్వరలోనే నాలుగు, అయిదో విడత కింద రూ.8,100 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించింది. వారికి మరింత సాయం అందించే క్రమంలో తాజాగా ‘అన్నదాతా సుఖీభవ’ పేరుతో కొత్త పథకాన్ని వెల్లడించింది. పెట్టుబడి సాయంగా ఎకరాకు కొంత మొత్తాన్ని చెల్లించనుంది.

రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యానశాఖల పరిధిలో మొత్తం 2 కోట్ల ఎకరాల సాగు భూములు ఉన్నాయి. భూ యజమానులు, కౌలు రైతులు కలిపి సుమారు 96లక్షల మంది ఉన్నారు. వీరికి ఏడాదికి ఎకరాకు రూ.10వేల చొప్పున సాయం అందిస్తే రూ.20వేల కోట్లు అవసరమవుతాయి. దాంతో ఎన్నికలకు వెళ్లే లోగా ఎకరాకు రూ.2,500 చొప్పున రైతుల ఖాతాలకు జమ చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ప్రస్తుత బడ్జెట్లో తొలి దఫా మొత్తాన్ని ఇచ్చేందుకు అవసరమైన రూ.5000 కోట్లనే కేటాయించింది. మరో పక్క కౌలు రైతుల సంఖ్య అధికంగా ఉంది. గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో 60శాతానికి పైగా భూములు కౌలుకు తీసుకుని సాగు చేసే వారే ఉన్నారు. వారిని కూడా ఈ పథకం పరిధిలోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. భూమి సొంతదారులకు సగం, కౌలుదారులకు సగం చొప్పున ఇస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తోంది.

వెసులుబాటు కలుగుతుందనే.. 
సాగుకు అవసరమైన పెట్టుబడి వెదుక్కోవడంలోనే రైతులకు అసలైన ఇబ్బంది ఎదురవుతోంది. మిర్చి, పసుపు, ఇతర ఉద్యానపంటలకు ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడి అవుతుండగా.. పత్తి, వరి తదితర పంటలకు రూ.30వేల వరకు ఖర్చుపెడుతున్నారు. పప్పుధాన్యాలు, చిరుధాన్యాల సాగుకు ఎకరాకు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు వ్యయమవుతోంది. రైతులు విత్తనం నుంచి ఎరువులు, పురుగుమందుల కొనుగోలుకు అదనులో సొమ్ము దొరక్క అధిక వడ్డీకి వ్యాపారుల నుంచి తెచ్చుకుంటున్నారు. దుకాణాదారులు అప్పుపై అంటగట్టే నకిలీ ఎరువులు, పురుగుమందులను వినియోగించాల్సి వస్తోంది. దీనివల్ల పెట్టుబడి వ్యయం పెరుగుతుండగాదిగుబడులు కూడా సరిగా రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే పెట్టుబడిగా కొంత మొత్తాన్ని అందిస్తే రైతుకు కొంత వెసులుబాటు కలుగుతుందని ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.

అనుబంధ రంగాలకు రూ.12,732 కోట్లు

బడ్జెట్ లో రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధులను పెంచింది. వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమలకు గత ఏడాదితో పోలిస్తే 26 శాతం అధికంగా రూ.12,732 కోట్లు కేటాయించింది. పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖల బడ్జెట్‌ను 16.51 శాతం పెంచి రూ.2,030.87 కోట్లు చేసింది.
* వ్యవసాయ యాంత్రికీకరణకు 17-18లో రూ.146 కోట్లు, 18-19లో రూ.258 కోట్లు ఇవ్వగా తాజా బడ్జెట్లో దీనిని రూ.300 కోట్లకు పెంచింది.
* పశు సంవర్థకశాఖలో బీమా అమలుకు గతేడాది రూ.50 కోట్లు కేటాయించింది. దీన్ని ఏకంగా రూ.200 కోట్లు చేసింది. పాడి పశువులతోపాటు మేకలు, గొర్రెలకు బీమా కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
* వర్షాభావం, కరవు నేపథ్యంలో మేత దొరక్క పశువులను అమ్ముకుంటున్న రైతాంగానికి దాణా, గడ్డి సరఫరా కోసం రూ.200 కోట్లు కేటాయించింది.
* ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు, మినీ గోకులాలు, పాతరగడ్డికి రైతుల నుంచి డిమాండు పెరుగుతుండటంతో పాటు వివిధ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా 50 వేల పశువులు పంపిణీ చేస్తున్న క్రమంలో బడ్జెట్‌ పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన సాగును కోటి ఎకరాలకు పెంచాలనే లక్ష్యంలో భాగంగా గతేడాది కంటే రూ.22 కోట్లు అధికంగా ఇచ్చింది.

మార్కెట్‌ జోక్యానికి మరింత మద్దతు
పంటలకు కేంద్రం మద్దతు ధరలు పెంచి ప్రకటిస్తున్నా సేకరణ శాతం తగ్గిపోతోంది. గతంలో మొత్తం ఉత్పత్తిలో 40 శాతం మేర కొనుగోళ్లు చేస్తుండగా ఇప్పుడది 20 శాతానికి తగ్గింది. ఈ భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతోంది. గత అయిదేళ్లలో రూ.3,556 కోట్ల విలువైన 9.27 లక్షల టన్నుల పంట ఉత్పత్తులను సేకరించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్‌ జోక్య నిధిని గత ఏడాది రూ.500 కోట్లతో ప్రతిపాదించారు.

కౌలు రైతులకు రుణాల్లో అగ్రస్థానం   

కౌలు రైతులకు రుణాలివ్వటంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. వివిధ పత్రాలు ఆధారంగా 2014-15 నుంచి ఇప్పటిదాకా 26 లక్షలు మందికి రూ.9,400 కోట్లు ఇచ్చారు. ఈ ఏడాది ఖరీఫ్‌, రబీలు కలిపి బ్యాంకుల నుంచి రూ.రూ.5,028.14 కోట్ల పంట రుణాలు మంజూరు చేయించింది.