Spread the love

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణాల మాఫీ ప్రక్రియను డిసెంబరులోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒక్కో రైతుకు రూ.లక్షన్నర చొప్పున ఐదు విడతలుగా రుణమాఫీ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు 2014లో ప్రకటించారు. ఆ ప్రకారం ఇప్పటి వరకు మూడు విడతల మాఫీ సొమ్మును అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేశారు. మూడు విడతలు మాఫీ వర్తించిన రైతులకు మరో రెండు (నాలుగు, ఐదు) విడతల సొమ్మును విడుదల చేయాల్సి ఉంది. వీరితో పాటు ఇప్పటి వరకు మాఫీ వర్తించని అర్హులను కూడా రైతు సాధికార సంస్థ ద్వారా గుర్తించి.. రుణమాఫీని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వివిధ జిల్లాల్లో వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రైతుసాధికార సంస్థ అధికారులు గ్రీవెన్స్‌లు నిర్వహించారు. వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి రుణమాఫీ వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఈ ఏడాది ఆగస్టులో మూడో విడత మాఫీ సొమ్ము పొందిన రైతుల సంఖ్య ప్రకారం రాష్ట్రంలో సుమారు 36.70 లక్షల మంది ఖాతాలకు ప్రభుత్వం నాలుగు, ఐదు విడతల సొమ్మును 10 శాతం వడ్డీతో కలిపి మొత్తం రూ.8,200 కోట్లు జమ చేయాల్సి ఉంది. రుణమాఫీ కోసం రైతుసాధికార సంస్థకు వచ్చే క్లెయిముల ప్రకారం ఈ బడ్జెట్‌ మరికొంచెం పెరిగే అవకాశముంది. సీఎం రుణమాఫీని ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు సాంకేతిక కారణాల వల్ల మాఫీ వర్తించని రైతులకు కూడా డిసెంబరులోగా దరఖాస్తులు పరిష్కరించి, మొత్తం మాఫీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరో ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నాలుగైదు విడతల సొమ్మును ఒకే సారి జమ చేసి.. బ్యాంకు రుణాల నుంచి రైతులకు విముక్తి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇప్పటిదాకా 15,054 కోట్లు మాఫీ…

వ్యవసాయం కోసం రైతులు పంటరుణాలు, బంగారంపైనా తీసుకున్న రుణాల మాఫీకి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.24,500 కోట్ల ఆర్థిక భారాన్ని మోస్తోంది. 2014లో చంద్రబాబు ప్రకటించిన విధంగా తొలివిడత 54.98 లక్షల రైతులకు రూ.7,565 కోట్లు మాఫీ చేశారు. అందులో రూ.50 వేల బకాయి ఉన్న 23.76 లక్షల మంది రైతులకు రుణ ఉపశమన పథకం కింద రూ.4493 కోట్లతో ఏక మొత్తంగా మాఫీ చేశారు. అలాగే 2.23లక్షల మంది ఉద్యాన పంటల రైతులకు రూ.385 కోట్లు చెల్లించారు. రెండో విడత రుణ మాఫీలో 10% వడ్డీతో 36.39 లక్షల మంది రైతులకు రూ.3,303 కోట్లు, మూడో విడత 10% వడ్డీతో 36.68 లక్షల మంది రైతులకు రూ.3,630 కోట్లు జమ చేశారు. ఇది కాకుండా రైతు సాధికార సంస్థకు వచ్చిన అన్ని రకాల అర్జీలను పరిశీలించి, మరో రూ.156 కోట్లు ఇచ్చారు. ఇప్పటి వరకు మొత్తం రూ.15,040 కోట్లను మాఫీ చేయగా.. నాలుగో విడత మాఫీకి 2018-19 బడ్జెట్‌లో రూ.4,100 కోట్లు కేటాయించారు. నాలుగో విడతకు బడ్జెట్‌లో నిధులు కేటాయించగా, ఐదో విడతకు అవసరమైన నిధులను ప్రణాళికేతర వ్యయంగా తీసుకుని, మొత్తం రుణమాఫీ ప్రక్రియను ఒకేసారి పూర్తి చేయాలని యోచిస్తోంది.