Spread the love

రాష్ట్రంలో రైతు ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాసనసభలో స్పష్టం చేశారు. ఎంత కరవు పరిస్థితులున్నా 2 కోట్ల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ప్రత్యామ్నాయ పంటల సాగులో భాగంగా పూర్తి రాయితీపై విత్తనాలు ఇస్తున్నామని చెప్పారు. పత్తిలో గులాబీరంగు పురుగు, మొక్కజొన్నలో కత్తెర పురుగు ఉద్ధృతిని గమనిస్తూ ప్రాంతాలవారీగా రైతులకు సూచనలు ఇస్తున్నామని తెలిపారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించడంతోపాటు సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. 5 లక్షల ఎకరాల్లో జీరో బడ్జెట్‌ సాగు చేపట్టి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు. పెట్టుబడిలేని ప్రకృతిసేద్య విధానంలో ఆవు పంచకం, సున్నపు నీరు చల్లి 3,500 హెక్టార్లలో పంటను కాపాడామని వివరించారు. ఈ నెల 24న ప్రకృతి వ్యవసాయంపై ప్రజెంటేషన్‌ ఇచ్చేందుకు ఐక్యరాజ్యసమితి మనరాష్ట్రాన్ని ఆహ్వానించిందని వెల్లడించారు. ఐరాస నుంచి ఆహ్వానం అందడంపై మంత్రి పరిటాల సునీత సహా టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపారు.