Spread the love

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన అవకాశం లభించింది. న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రసంగించాల్సిందిగా ఆయన్ని యూఎన్ఓ ఆహ్వానించింది. వ్యవసాయంలో ఆర్థిక సుస్థిరత, అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలపై సెప్టెంబరు 24న న్యూయార్క్‌లోని యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీలో జరిగే సదస్సులో ప్రసంగించాల్సిందిగా కోరుతూ ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు యూఎన్ఓ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎరిక్‌ సోల్తెయిమ్‌ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు.

ఏపీలో సేంద్రియ సాగుపై న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం

ఏపీలో అనుసరిస్తున్న సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల గురించి గతంలో న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ ప్రత్యేక కథనం కూడా ప్రచురించింది. ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం కోసం ఏపీ ప్రభుత్వం ప్రతీ ఏడాది సుమారు రూ.2500 కోట్లు వెచ్చిస్తోందంటూ ఆ కథనంలో పేర్కొన్నారు. 2024లోపు 60 లక్షల మంది రైతులను సేంద్రీయ సాగుబాట పట్టించాలని ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యానికి యూఎన్ఓ తోడ్పాటు అందించాలని నిర్ణయించింది. ఐక్యరాజ్య సమితి నిర్వహించే ఈ సదస్సుకు పర్యావరణ విభాగం, మహిళా విభాగం, బీఎన్‌పీ పారిబాస్‌, ప్రపంచ ఆగ్రోఫారెస్ట్రీ కేంద్రం, పలు ఇతర సంస్థలు హాజరవుతున్నాయి.