Spread the love

ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లల్లో రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గిందని వ్యవసాయశాఖ అధికారులు గురువారం కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. రసాయన ఎరువుల వినియోగం 5.21 లక్షల మెట్రిక్‌ టన్నులు తగ్గగా, రైతులకు రూ.943.77 కోట్ల సొమ్ము ఆదా అయ్యిందని, కేంద్ర ప్రభుత్వానికి రూ.815.63 కోట్ల రాయితీ ఆదా అయ్యిందని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ మురళీధర్‌రెడ్డి వివరించారు. పురుగు మందుల వినియోగం 2208.84 మెట్రిక్‌ టన్నులు తగ్గడంతో రూ.1933 కోట్లు రైతులకు ఆదా అయ్యిందన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఈ ఏడాది 96 శాతం పంటను ఈ-క్రాప్‌ కింద నమోదు చేశామని, మిగిలిన 4 శాతాన్ని నెలాఖరులోగా పూర్తి చేస్తామని చెప్పారు. ఖరీఫ్‌లో 102 శాతం సూక్ష్మపోషకాలను రైతులకు పంపిణీ చేశామని, రబీలో 1.75 లక్షల హెక్టార్లకు 18,310 టన్నుల సూక్ష్మపోషకాలు అందించనున్నట్లు తెలిపారు.

2024నాటికి నూరు శాతం ప్రకృతి సేద్యమే లక్ష్యం

రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ఖరీఫ్‌లో 1.92 లక్షల హెక్టార్లలో పంట సాగవలేదని కలెక్టర్లు నివేదించారు. రాష్ట్రంలో చేపట్టిన పెట్టుబడిలేని వ్యవసాయ విధానం ప్రపంచంలోనే అతిపెద్ద ఆగ్రో ఎకాలజీ ప్రోగ్రాం అని వ్యవసాయశాఖ సలహాదారు డాక్టర్‌ విజయ్‌కుమార్‌ చెప్పారు. రాష్ట్రంలో 5 లక్షల మంది ప్రకృతి సేద్యం చేస్తుండగా, 2024 నాటికి నూరు శాతం రైతుల్ని ఈ విధానంలోకి మరలేలా కృషి చేయాలన్నారు. ఉద్యాన సాగును కోటి ఎకరాలకు పెంచాలని ఉద్యానశాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి అన్నారు. రైతులకు అదనపు ఆదాయం కోసం 12 వేల తేనెటీగల పెట్టెలు ఇవ్వాలని చిత్తూరు కలెక్టరు కోరగా.. చంద్రబాబు ఆమోదించారు.