Spread the love
గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే అప్పట్లో రవాణా సౌకర్యం అందుబాటులో లేని కారణాలు మరియు అనేక రకాల కారణాల వలన స్థానికంగా దొరికే ఆహారాలు మాత్రమే తింటూ జీవితాన్ని గడుపుతుండేవారు. కాని రాను రాను అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో ఒక చోట నుండి వేరే చోటికి రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావటంతో ఏ వస్తువైనా ఎలాంటి మారుమూల పల్లెలోనైనా అందుబాటులోకి తేవడం జరిగింది. ఈ పరిణామాలు ఇంకొంత ముందడుగు వేసి గ్లోబలైజేషన్‌ నేపథ్యంలో ప్రపంచంలో అన్ని ప్రదేశాలలో ఇతర ప్రాంతాలలో లభించే వస్తువులు కూడా అందుబాటులో ఉంటున్నవి. వ్యవసాయ రంగం కూడా దానికేమీ అతీతం కాకుండా ప్రస్తుత పరిస్థితులలో ఆయా దేశాలలో లభించని పండ్లు, కూరగాయలలాంటివి లభించే దేశాల నుండి దిగుమతి చేసుకుని వినియోగ దారులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఈ క్రమంలో విదేశీ పండ్లు, కూరగాయలు మన దేశంలోని పెద్ద పెద్ద నగరాలలో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. దానిని గమనించిన నరసింహరాజు మరియు సుదర్శన ప్రసాద్‌ వర్మ మిత్ర ద్వయం ఈ విదేశీ కూరగాయలను స్థానికంగానే పండించి వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో పలు రకాల విదేశీ రకాల కూరగాయలను ప్రయోగాత్మకంగా పండిస్తూ వాటి సాగు మరియు మార్కెటింగ్‌లో ఉన్న సాధక బాధకాలను అవగాహన చేసుకుంటున్నారు.
ఆహార పదార్థాలలో ఉన్న రసాయనిక అవశేషాలు ప్రజల ఆరోగ్యాలను చెడగొట్టడం మరియు విచక్షణారహిత రసాయనాల వినియోగం వలన నేల, నీరు, భూమి, వాతావరణం కలుషితమవుతున్న విషయం ఇటీవల కాలంలో ప్రజలు అవగాహన చేసుకుంటున్నారు.ఈ సమస్యలకు పరిష్కారం వ్యవసాయంలో రసాయనాలను మానివేసి సేంద్రియ పద్ధతులు పాటించడమే అని గమనించిన వీరు మేడ్చెల్‌ సమీపంలో ఒక ఎకరంలో పలు రకాల స్థానిక కూరగాయలను 2013వ సంవత్సరం నుండి సాగు చేస్తూ ఆరోగ్యకర దిగుబడి తీస్తూ వచ్చిన దిగుబడి తాము సొంతంగా ఉపయోగించుకుంటూ తోటి స్నేహితులకు ఇస్తూ వస్తున్నారు. స్థానికంగా అందుబాటులో ఉండే వంగ, బెండ, టమాట, చిక్కుడు, పాలకూర, తోటకూర మొదలగు కూరగాయలు మరియు ఆకుకూరలు సేంద్రియ పద్ధతిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పండించిన స్ఫూర్తితో వారి దృష్టి విదేశీ కూరగాయలపై మరల్చి వీటిని పూర్తి సేంద్రియ పద్ధతిలో పండించి సమాజానికి అందించాలనే లక్ష్యంతో ముందుకు నడుస్తున్నారు.
మేడ్చెల్‌ సమీపంలో ఒక ఎకరం స్థలంలో వివిధ రకాల కూరగాయలు, ఆవుల కొరకు మేతను పెంచుతున్నారు. రెండు దేశీయ ఆవులను పోషిస్తూ వాటి వ్యర్థాలతో వివిధ రకాల కషాయాలు ద్రావణాలు తయారు చేసుకొని పంటలపై ఉపయోగిస్తున్నారు. సుమారు 100 రకాలకు పైగా కూరగాయలు మరియు ఆకుకూరలు పండిస్తున్నారు. ప్రత్యేకించి సెలరి, పార్శిలి, లీక్‌, కేల్‌, బ్రొకోలీ, పాక్‌బైన్‌, బ్రసెల్స్‌ స్ట్రాట్‌, లెట్యూస్‌, చెర్రి టమాట, కాప్సికం, నూల్‌కోల్‌, టర్నిప్‌, ఆస్పరాగస్‌, బేసిల్‌ మొదలగు విదేశీ కూరగాయల రకాలతో పాటు మన దేశీ రకాలైనటువంటి బెండ, వంగ, టమాట, చిక్కుడు, గోరుచిక్కుడు, బీర, కాకర, పొట్ల, బెంగుళూరు వంగ, కాలీఫ్లవర్‌, క్యాబేజీ, పచ్చిమిర్చి మొదలగు కూరగాయలతోపాటు వివిధ రకాల ఆకుకూరలు, కంది, అరటి మొదలగు పంటలు పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు.
విదేశీ రకం కూరగాయల విత్తనాలను పూణే నుంచి తెప్పించి ఉపయోగిస్తున్నారు. స్థానిక రకాలని స్థానికంగానే సేకరిస్తున్నారు. ఈ పంటలన్నింటికి దుక్కిలో బాగా మాగిన దేశీయ ఆవుల ఎరువును అందించడంతో పాటు పైపాటుగా నెలకు ఒకసారి 200 లీటర్ల జీవామృతం అందిస్తూ అవకాశం ఉన్నప్పుడల్లా ఆవుమూత్రాన్ని డ్రిప్పు ద్వారా వివిధ మొక్కలకు అందిస్తున్నారు. పంటలపై బవేరియా బాసియానా, వర్టిసీలియం లఖాని, ట్రైకోడెర్మావిరిడి, ఇ.పి.యన్‌లతో పాటు అన్ని రకాల జీవన ఎరువులను పిచికారి చేస్తున్నారు. వీటితో పాటు లింగాకర్షకబుట్టలు, పసుపు రంగు జిగురు అట్టలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా సేంద్రియ వ్యవసాయానికి అవసరమైన అన్ని మెళకువలు తెలుసుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా విదేశీ రకాలు మరియు మన స్థానిక రకాలు కలిపి 100 రకాలకు పైగా పంటలను ప్రయోగాత్మకంగా పండిస్తున్నారు. ఆర్థికపరమైన అంశానికి వస్తే 2018వ సంవత్సరం మే నెల నుంచి 2019 సంవత్సరం జనవరి వరకు సుమారు 50,000/  ల వరకు ఖర్చు చేసి, అన్ని రకాలు కిలో50/రూ. చొప్పున లెక్క వేసుకొంటే సుమారు 80,000/ల వరకు దిగుబడిని కేవలం 9 నెలలలో తీయడం జరిగింది. ఇంకా రాబోవు 3 నెలల్లో ఇంకా కొంత దిగుబడి పొందే అవకాశం ఉంది. వాటికి అదనంగా సుమారు 60 కిలోల కందులను కూడా పొందినారు. మరిన్ని వివరాలు 9676486789 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
ఆవులకు పశుగ్రాసం
తమ దగ్గర పెంచే ఆవులకు కూడా అక్కడే పశుగ్రాసాన్ని పెంచుతున్నారు. ఇందుకుగాను గింజ జాతి మరియు పప్పుజాతి పశుగ్రాసాలను ఎన్నుకొని సాగు చేస్తున్నారు. అవి నేపియర్‌ మరియు హెడ్జ్‌లూసర్న్‌. వీరి అనుభవం ప్రకారం 75 శాతం గింజజాతి పశుగ్రాసం, 25 శాతం పప్పుజాతి పశుగ్రాసం సాగు చేసుకున్నట్లయితే పశువులకు సమీకృత పశుగ్రాసాన్ని అందించటానికి అవకాశం ఉంటుంది. వీరు సాగు చేసే పప్పుజాతి పశుగ్రాసం హెడ్జ్‌లూసర్న్‌ బహు వార్షికం. ఇది ఒకసారి నాటుకుంటే 5 సంవత్సరాలకు పైగా దిగుబడి పొందవచ్చు.
ఆనందం, ఆరోగ్యం కొరకు ఆర్గానిక్‌ గార్డెన్‌ : నరసింహరాజు మనోగతం
జీవితంలో ఒక సమగ్రమైన అభివృద్ధి కోసం జీవవైవిధ్యమున్న అడవి లాంటి ఈ గార్డెన్‌ను సృష్టించడం జరిగింది. ఇది మనకు అందం, ఆరోగ్యం, ఆహారం, ఆనందం అన్నింటిని ప్రకృతి సిద్ధంగా, సహజంగా ఇస్తుంది.
ఆరోగ్యం : వ్యాయామం లేదా శారీరక శ్రమ ఎంత అవసరమో మనందరికీ తెలుసు. ఎనర్జీని మనం సృష్టించలేం. అలాగే ధ్వంసం కూడా చేయలేం. సృష్టిలో ప్రతి జీవి తను ఎంత ఎనర్జీ ఖర్చు పెట్టగలదో, అంత ఆహారం మాత్రమే తీసుకోగలదు. కాని సుమారుగా అది + 5% అయ్యింటుంది. మనిషిగా మనకున్న సౌలభ్యం, ఆహార లభ్యత, రంగు, రుచి, వాసన వలన మనం రోజూ సుమారుగా 5% ఎక్కువ ఆహారం తీసుకుంటాం. అంటే అది సుమారుగా 200 కేలరీలు అయ్యుంటుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా దాన్ని ఖర్చు పెట్టాలి. అంటే వాకింగ్‌ చెయ్యాలి. లేదా జిమ్‌కి వెళ్ళి ఫీజు కట్టి బరువులు ఎత్తాలి. ఇవన్నీ ఎలాంటి ఉత్పాదకత లేనివి. కాని ఇక్కడ మనం గార్డెన్‌ పనిచేస్తూ ఖర్చు పెట్టే ప్రతి కేలరీకి, 10 కేలరీల కంటే ఎక్కువ శక్తి నిచ్చే, ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, కల్తీలేని ఆహారాన్ని ప్రకృతి మనకు ఇస్తుంది. ఇంతకంటే లాభసాటిగా ఉండే వ్యాయామం కాని, పనికాని మనకు ఎక్కడా దొరకదు. ఆరుబయట వ్యాయామం చెయ్యటం వలన విటమిన్‌ డి అదనం. మనచుట్టూ పచ్చదనం పరచుకొని ఉండటం వల్ల, మన ఇంటిలో ఉష్ణోగ్రత తగ్గుతుంది.  ధ్వని కాలుష్యం తగ్గుతుంది. మనిషి ప్రమాణాల ప్రకారం, ఆరోగ్యంగా బ్రతకటానికి కావలసిన పరిస్థితులను ఇలాంటి గార్డెన్స్‌ సృష్టిస్తాయి. ఇక్కడే విశ్రాంతి పొందవచ్చు. పనివిశ్రాంతి రెండూ ఇక్కడి నుంచే పొందవచ్చు. ప్రకృతికి మించిన రిలాక్సేషన్‌ ఏదీ ఉండదు.
ఆహారం : ఆహారం యొక్క నాణ్యత నిర్ణయించటానికి, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఒప్పుకొనే కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. అందులో ఒకటి ”గుడ్‌ అగ్రికల్చర్‌ ప్రాక్టీసెస్‌”, కాని మనం ఇక్కడ ”బెస్ట్‌ అగ్రికల్చర్‌ ప్రాక్టీసెస్‌” ఆచరిస్తున్నాం. రెండోది ”మినిమం రెసిడ్యు లెవెల్‌”, అంటే మనం తినే ఆహారంలో క్రిమిసంహారాలు, విష రసాయనాల యొక్క అవశేషాలు నిర్దిష్ట మోతాదు కంటే తక్కువగా ఉండవచ్చు. మనం పెంచుతున్న ఈ విధానంలో ఆహారం స్వచ్ఛంగా ఉంటుంది. ఆయుర్వేద పితామహులలో ఒకడైన సుశ్రుతుడు ఆహారం గురించి ఏమి చెప్పాడంటే, హిత, మిత, ఋతాహారం తీసుకోవాలని చెప్పాడు. అంటే ఆ ఋతువులో పండే, హితం చేసే ఆహారాన్ని, మితంగా తినాలని అర్థం. ‘ఆల్బర్ట్‌ హోవర్డ్‌’ అనే బ్రిటిషర్‌ గొప్ప ఆర్గానిక్‌ వ్యవసాయ శాస్త్రవేత్త. ఆయన ‘యాన్‌ అగ్రికల్చర్‌ టెస్ట్‌మెంట్‌’ అనే పుస్తకం వ్రాశాడు. మన దేశాన్ని బ్రిటిష్‌ వాళ్ళు పరిపాలిస్తుండగా, సుమారు వంద సంవత్సరాల క్రితం, ఇండియన్‌ అగ్రికల్చర్‌ మీద ఒక రిపోర్టు తయారు చెయ్యమని ఆల్బర్ట్‌ హోవర్డ్‌ని, ఇండియాకు తీసుకొచ్చారు. ఆయన ఆ పనిలో భాగంగా ఇండియాలో ఆచరణలో ఉన్న వ్యవసాయ విధానాల్ని చాలా చోట్ల అధ్యయనం చేశాడు. ఆయన తన ఫైనల్‌ రిపోర్టులో వ్రాసినదేమిటంటే, ఇండియన్స్‌కి వ్యవసాయం గురించి మనం ఏమీ చెప్పనవసరం లేదు. కాని వాళ్ల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అన్నాడు. ఇండియన్స్‌ ఒక సుస్థిరమైన, స్వయంపోషకమైన, ప్రకృతి అనుకూలమైన, మిశ్రమ వ్యవసాయం జేస్తున్నారని ఆయన చెప్పాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏ భూమిలో అయితే కర్బన పదార్థం అధికంగా ఉంటుందో, ఆ భూమిలో పండిన ఆహారం తిన్న పశువులు కాని, మనుష్యులు కాని అనారోగ్యానికి గురి కారని ఆయన చెప్పాడు. ఈ విషయాన్ని ఆయన చెప్పి చాలా కాలం గడిచింది. 50 సంవత్సరాల కంటే ముందు మన వ్యవసాయ భూముల్లో 3% కర్బన పదార్థం ఉండేది. ఇప్పుడు 0.3% కంటే తక్కువ ఉంది. మనం చూస్తున్న సోకాల్డ్‌ ఆర్గానిక్‌ ఉత్పత్తుల్ని పండించే భూముల్లో ఎంత కర్బన పదార్థం ఉంటుందో భగవంతునికే తెలియాలి. భూమిలో కర్బన శాతం ఎక్కువ ఉండాలి. గాలిలో నిర్ధిష్టంగా ఉండాలి. భూమిలో తగ్గిపోతుంది. గాలిలో పెరిగిపోతోంది. దీనివల్లే వాతావరణంలో వేడి పెరిగి సమతుల్యం దెబ్బతింటోంది. మనం నాగరికులమా, తెలివైన వాళ్ళమా అని మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన సమయం ఇది. కర్బన శాతం తక్కువున్న భూముల్లో పండిన పంట, అది ఆర్గానిక్‌ అయినాసరే దానిలో ఎక్కువ పోషకాలు ఉండవు. మనకి గొప్ప శాస్త్ర, సనాతన, సాంద్రపాయ విజ్ఞానం ఉంది. గొప్పజీవవైవిధ్యం మనకున్న వరం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉంది. టెర్రస్‌గార్డెన్‌, కిచెన్‌ గార్డెన్‌ లేదా నగరాల్లో వ్యవసాయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిన దేశాల్లో క్యూబా ఒకటి. అమెరికా విధించిన ఆంక్షల వల్ల ఆహారం, ఎరువులు, పురుగు మందుల దిగుమతి పూర్తిగా ఆగిపోయి, ఆహార కొరత ఏర్పడి, తప్పనిసరి పరిస్థితులలో వాళ్ళు ఆర్గానిక్‌ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకొన్నారు. ఈ పరివర్తన తరువాత క్యూబా ప్రజల ఆరోగ్యం, పర్యావరణంలో నిర్మాణాత్మకమైన మార్పు కనిపించింది. దీన్ని ప్రతి ఒక్కరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మన సమాజంలో కూడా ఇలాంటి కంటికి కనిపించని ఒక ఎమర్జెన్సీ ఉంది. అలారం మ్రోగుతోంది కాని, మనం మొద్దు నిద్ర నటిస్తున్నాం. మనం తయారు చేసుకొన్న లేదా పండించిన ఆహారం కంటే ఉత్తమ ప్రమాణాలు కల్గిన పోషకాహారం ఎక్కడా దొరకదు.
ఆనందం : ఏ మనిషైతే ప్రకృతికి దగ్గరగా బతుకుతాడో, అతను చాలా ఆనందంగా ఉంటాడని ప్రఖ్యాత ఆర్గానిక్‌ శాస్త్రవేత్త్త  పుకుఓకా చెబుతారు. ప్రకృతిలో ఒక సింబయాసిస్‌ ఉంటుంది. సింబయాసిస్‌ అంటే రెండు ప్రాణమున్న జీవులు ఒకదానిమీద ఒకటి ఆధారపడి, ఒకదానికొకటి సహకరించుకొంటూ, రెండూ లబ్ది పొందటం. ఈ సహకార విధానాన్ని మనం అలవర్చుకోగలిగితే అంత కంటే ఆనందం ఏమీ ఉండదు. పూర్తిగా మనిషి జోక్యం వలనే ఈ ఆహారగొలుసు దెబ్బతింటుంది. గార్డెన్‌లో చాలా మొక్కలు వాటంతట అవి మొలిచి అద్భుతమైన ఫలసాయం ఇవ్వటం నేను చాలాసార్లు గమనించాను. మనకు ఏదైనా ఉచితంగా వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. కాని ప్రకృతి మనకు ప్రతీది ఉచితంగానే ఇస్తుంది. కబీర్‌ అనే తత్వవేత్త ఏమి చెప్పాడంటే, ”పాలు ఇంటింటికి తిరిగి అమ్ముకోవాలి, కాని కల్లు పాక దగ్గరికి అందరూ వెళతారు, మనకి సత్యం పట్ల నమ్మకం తక్కువ అన్నాడు. ఆహార, వ్యవసాయ రంగాల్లో చాలామంది మేధావులు, ఆలోచనా పరులు ఈ మధ్యకాలంలో సమాజాన్ని అద్బుతంగా ప్రభావితం చేస్తున్నారు. సోషల్‌మీడియా లేకపోతే వాళ్ళ అంతర్మధనం బయటకొచ్చేది కాదు. ఇలాంటి సందర్భంలో బుద్ధుడు చెప్పిన సూక్తి అతికినట్టు సరిపోతుంది. అదేమిటంటే ”ప్రతి విషయానికి మూడు పార్శ్వాలు ఉంటాయి. ఒకటి మనకి అర్థమయ్యేది. రెండోది ఎదుటి వారికి అర్థమయ్యేది. మూడోది అంతిమ సత్యం”. మన మెదడులోనైనా, భూమిలోనైనా కలుపు మొక్కలు మన ప్రమేయం లేకుండానే మొలుస్తాయి. వాటిని సరైన సమయంలో నిర్ధాక్షిణ్యంగా పెకిలించి వేయటంలో ఆనందం ఉంటుంది. ఒక మొక్క నాటినోడు, సెలబ్రిటి అయితే, వేల మొక్కల్ని నాటినోడ్ని ఏమనాలి. అతను లెజండ్‌ కాదు. స్వయంగా సృష్టికర్త. దురదృష్టవశాత్తు మన దేశంలో అలాంటి వాళ్ళను ”రైతు” లంటాం. మనం ఇప్పటికైనా శ్రమకు విలువనివ్వటం నేర్చుకోవాలి. ఒక మొక్క నాటడానికి మంచి సమయం గతించి పోయింది. ఆ పని మనం ఎప్పుడో చేసి ఉండాల్సింది. కాని చేజారిన అద్భుతాన్ని తిరిగి పొందే అవకాశం ఏమిటంటే దానికి మంచి ముహూర్తం అవసరం లేదు. తక్షణం ఆపని మొదలు పెడదాం. సుజలాం, సుఫలాం, మలయజశీతలాం, సస్యశ్యామలం అని చిన్నప్పటి నుంచి చదువుకొంటున్నాం. ఆ మార్గానికి పునరంకితమవుదాం. మన విద్యార్థులకు, ఆచరణాత్మకమైన ప్రకృతి విజ్ఞానం గురించి, ప్రయోగాత్మకంగా తెలియచెప్పాలి. అటవీకరణ లేదా పచ్చదనం పెంచటం, ప్రకృతి వ్యవసాయం, వాననీటి సంరక్షణ, భూమికోత నివారణ, భూమి మరియు పర్యావరణాన్ని ఆరోగ్యాంగా ముందు తరాలకు అందించటం గురించి తెలియచెయ్యటం లేదా నేర్పటం మన జీవనశైలిలో భాగం కావాలి. ఈ ప్రయాణాన్ని ఆస్వాదించటంలో ఉన్న ఆనందం ఇంకెక్కడా ఉండదని నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మనిషి నిత్యాన్వేషి. ప్రకృతిని శోధించటం, అన్వేషించటం గొప్ప ఆనందం. ఆ ఆనందాన్ని బయట ఎక్కడో వెతుక్కొనే కంటే మన ఇంటి నుంచే సమృద్ధిగా పెంచుకొందాం.