Spread the love

దేశంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిందే కుసుమ్ (కిసాన్ ఊర్జా సురక్షా ఏవమ్ ఉత్థాన్ మహాభియాన్) పథకం. సౌర విద్యుత్ వినియోగించేలా రైతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ పథకం జూలై నుంచి అమల్లోకి రానుందని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రకటించారు. రూ.1.4 లక్షల కోట్ల వ్యయంతో చేపడుతోన్న ఈ పథకంలో భాగంగా రైతులకు 27.5 లక్షల సౌర విద్యుత్ మోటార్లను ప్రభుత్వ అందజేయనుంది.

కుసుమ్ పథకం ఇచ్చే సౌర విద్యుత్ మోటార్లు రెండు విధాలుగా ఉంటాయి. 17.5 లక్షల మోటార్ల వద్ద ఏర్పాటు చేసే సోలార్ ప్యానల్స్ నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్ ను ఆ మోటర్ల కోసమే వినియోగిస్తారు. మరో 10 లక్షల సౌర విద్యుత్ మోటార్ల వద్ద ఏర్పాటు చేసే సోలార్ ప్యానల్స్ నుంచి ఉత్పత్తయ్యే అదనపు విద్యుత్ (మోటార్ల అవసరం తీరిన తర్వాత)ను రైతులు విక్రయించుకోవచ్చు. దీని కోసం వీటిని గ్రీడ్ తో అనుసంధానం చేస్తారు. ఇలా మిగులు విద్యుత్ ను విక్రయించుకునే అవకాశం కల్పించడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందుతారని మంత్రి వెల్లడించారు.

రెండో పద్ధతిలో రైతులు దాదాపు 10 గిగావాట్ల సౌర విద్యుత్ ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీని కోసం ఒక్కో రైతు 0.5 నుంచి 2 మెగావట్ల సామర్థ్యం ఉన్న సౌర విద్యుత్ కేంద్రాలను సొంతంగా ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అలాగే జల విద్యుత్ కేంద్రాలను సమస్యల నుంచి గట్టెక్కించడానికి రూ.16 వేల కోట్లతో హైడ్రోపాలసీని తీసుకొచ్చే యోచనా ప్రభుత్వానికి ఉందని మంత్రి తెలిపారు.