Spread the love

పంటలను నిల్వ చేసే గోదాములనే ‘ఆన్‌లైన్‌ అమ్మకాల మార్కెట్‌గా మార్చేందుకు కేంద్రం కొత్త పథకాన్ని ప్రారంభించింది. గోదాముల అభివృద్ధి, నియంత్రణ మండలి’(డబ్ల్యుడీఆర్‌ఏ) ద్వారా ఈ పథకం అమలుకు సాంకేతిక ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం సాధారణ మార్కెట్లకు రైతులు తెస్తున్న పంటలను ఆన్‌లైన్‌ విధానంలో అమ్ముకునేందుకు ‘ఎలక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌’(ఈనామ్‌) పథకం అమల్లో ఉంది. దీనినే గోదాముల ద్వారా అమలుకు డబ్ల్యుడీఆర్‌ఏ శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ(టీఎస్‌డబ్ల్యుసీ) ద్వారా దీని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది.

నెలాఖరులోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు సొంతంగా 27 చోట్ల 2.80 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యమున్న గోదాములున్నాయి. వీటన్నింటినీ ఈ నెలాఖరులోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ప్రతి 5 వేల టన్నుల గోదాముకు రూ.7500 రిజిస్ట్రేషన్‌ రుసుముగా చెల్లిస్తే అయిదేళ్లపాటు సదరు గోదామును ఆన్‌లైన్‌లో డబ్ల్యుడీఆర్‌ఏ ఉంచుతుంది. ఆ గోదాములో ఏ పంటను ఎవరు నిల్వ చేశారు, రైతా లేదా వ్యాపారా అనే వివరాలతో పాటు పంట నాణ్యతను 1, 2, 3 గ్రేడుల వారీగా గిడ్డంగుల సంస్థ సిబ్బంది ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఈ వివరాలన్నీ డబ్ల్యుడీఆర్‌ఏ వెబ్‌సైట్‌లో ఎవరైనా చూడవచ్చు. పంటను రైతు ఎంత ధరకు అమ్ముతారనేది సొంతంగా ఆన్‌లైన్‌లో అదే వెబ్‌సైట్‌లో గోదాము పేరు వద్దనే కోట్‌ చేయాలి. రైతు నమోదు చేసిన ధర నచ్చిన వారెవరైనా అంతకన్నా ఎక్కువ లేదా తక్కువ ధరను తిరిగి అదే వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. ఈ ధరలు నచ్చితే రైతు అమ్మకానికి అంగీకారం తెలపాలి. కొనుగోలుదారులు సొమ్మును డబ్ల్యుడీఆర్‌ఏ ద్వారా బ్యాంకు ఖాతాలో వేస్తారు.

బ్యాంకునుంచి రుణం తీసుకునే అవకాశం

ఇలా నమోదు చేసే గోదాముకు మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. పంటలకు బీమా సదుపాయం వంటివన్నీ కల్పించే గోదాములను మాత్రమే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేయాలని డబ్ల్యుడీఆర్‌ఏ నిబంధన పెట్టింది. పంటను కొనదలచిన వారు గోదాములో నేరుగా పంట నాణ్యతను పరిశీలించుకునేందుకు గిడ్డంగుల సంస్థ అనుమతిస్తుంది. గోదాముల్లో ఈనామ్‌ అమలు వల్ల రైతుల పంటకు గిట్టుబాటు ధర రావడానికి మంచి అవకాశాలున్నాయి. ఆన్‌లైన్‌లో కోట్‌ చేసిన ధరలు నచ్చకపోతే అవే వివరాలను బ్యాంకుకు తెలిపి పంట మార్కెట్‌ విలువలో 80 శాతం సొమ్మును రుణంగా తీసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు.