Spread the love
ప్రకృతినేస్తం:   భారతదేశం వ్యవసాయక దేశం. ఎక్కువమంది ప్రజలు వ్యవసాయ మరియు దాని అనుబంధరంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో 90 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయ రంగంలో ఉండేవారు. కాని రాను రాను వేరే రంగాలకు మరలేవారు పెరిగినా కూడా ఇప్పటికీ కూడా వ్యవసాయరంగంపై ఆధారపడి జీవించేవారు 60 శాతానికి పైగా ఉన్నారనేది అక్షరసత్యం. వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చిన వారు కొంతమంది మొదటిలో వ్యవసాయ రంగంలో  ఉంటూ కొన్ని సంవత్సరాల తరువాత వేరే రంగాలకు మరలడం మరియు ఇతర రంగాలలో కొంతకాలం గడిపిన తరువాత మరలా వ్యవసాయ రంగంలో తిరిగి ప్రవేశించడం ఇటీవల సర్వసాధారణమైంది. ఇదే కోవకు చెందుతాడు నల్లగొండ జిల్లా, నాంపల్లి మండలం గట్ల మల్లేపల్లికి చెందిన శ్రీనివాసరెడ్డి.
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాసరెడ్డి తమ పెద్దల వ్యవసాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. తోటి రైతుల మాదిరిగానే తాను కూడా తన వ్యవసాయాన్ని చేసుకుంటూ వస్తూ మోటారు మెకానిక్‌గా సేవలు చెయ్యడం జరిగింది. ఈ విధంగా రెండు విధులు కొనసాగిస్తుండగా సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకోవడం జరిగింది. అప్పటికి తాను సాగు చేస్తున్న బత్తాయి తోటలో ఎదిగిన బత్తాయి చెట్లు ప్రతి సంవత్సరం కొన్ని చనిపోవటం జరుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారం కోసం వెతుకుతూ, సేంద్రియ వ్యవసాయం గురించి వినడం జరిగి, దాని గురించి ఎక్కువగా తెలుసుకోవాలనే ధ్యేయంతో పాలేకర్‌ సదస్సుకు హాజరవడం, పాలేకర్‌ పుస్తకాలు చదవటం మరియు పాలేకర్‌ గ్రామానికి వెళ్ళి వారిని కలవడం కూడా జరిగింది. ఆ దిశగా అడుగులు వేస్తూ తాను చేస్తున్న రసాయన వ్యవసాయంలో నుంచి సేంద్రియంలోకి మారాలని తలంచి అటువైపు అడుగులు వేసి ఒక సంవత్సరం కొన్ని పంటలను సేంద్రియ పద్ధతిలో పండించటం జరిగింది. కాని కొన్ని కారణాల వలన తన పంట భూమిని వేరే రైతుకు కౌలుకి ఇచ్చి హైదరాబాద్‌ నగరం వెళ్ళి రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రవేశించటం జరిగింది. ఈ మధ్యలో బత్తాయి తోటని మొత్తం తీసివేయటం కూడా జరిగింది.
రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉన్నా కూడా తన మనస్సు వ్యవసాయ రంగంవైపు పీకుతూనే ఉంది. ఇదే సమయంలో మరలా సేంద్రియ వ్యవసాయం గురించి ప్రజలలో ఎక్కువగా అవగాహన రావడం గమనించిన శ్రీనివాసరెడ్డి మరలా వ్యవసాయరంగంలో ప్రవేశించాలని నిర్ణయించుకొని తన పొలాన్ని మరలా తానే స్వయంగా సాగు చేయాలని తలచి ఆ దిశలో అడుగులు వేయడం జరిగింది.
తన వ్యవసాయాన్ని సేంద్రియ పద్ధతిలో చేయాలని తలచి అందుకు అనుగుణంగా దేశీయ ఆవులను పోషించడం మరియు వాటికి అవసరమైన షెడ్‌ నిర్మాణాన్ని కూడా చేయడం జరిగింది. మొదట్లో వరి పంటను సేంద్రియ పద్ధతిలో సాగు చేయదలచి గత సంవత్సరం వరిని ఒక ఎకరంలో సేంద్రియ పద్ధతిలో సాగు చేయటం జరిగింది. ఈ సంవత్సరం దొండ, వరి, మునగ మరియు ప్రత్తి పంటలను సాగు చేస్తున్నాడు. వ్యవసాయంతో పాటు నాటు ఆవులను కూడా పోషిస్తూ వాటి వ్యర్థాలను పంటల సాగుకు ఉపయోగిస్తున్నాడు.
దొండ : ఒక ఎకరం ఇరవై అయిదు సెంట్లలో దొండను సాగు చేయదలచి పందిరి వేయటం జరిగింది. పందిరికి గాను 8 అడుగుల పొడవు గల 250 రాళ్ళను ఒక్కొక్కటి రూ. 320/ల చొప్పున కొనుగోలు చేయడం జరిగింది. ఒక అడుగు భూమి లోపల ఉండేలా రాళ్ళను పాతుకొని 6 అడుగుల ఎత్తులో ఇనప తీగను పందిరిగా అల్లించడం జరిగింది. రాయి పైనుంచి ఒక అడుగు క్రిందకు తీగను బిగించడం జరిగింది. ఇందుకు గాను సుమారు 1200 కిలోల తీగ అవసరం పడింది. ఇనుప తీగ ధర సుమారుగా కిలో రూ. 90/లు. నిలువుగా మరియు అడ్డంగా 14 అడుగుల దూరంలో రాళ్ళను ఏర్పాటు చేసుకోవటం జరిగింది. నాలుగువైపులా ఉన్న చివర లైను రాళ్ళను కొంచెం వాలుగా వంచి వాటికి పోటీగా మరలా వేరే రాళ్ళను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పందిరిలో దొండ మొక్కలను లైనుకి లైనుకి 7 అడుగులు మరియు మొక్కకు మొక్కకు ఒకటిన్నర అడుగు ఉండేలా ఆగస్టు 14న నాటించటం జరిగింది. మొక్క దుంపలను తెలిసిన రైతు వద్ద నుంచి తెచ్చుకోవటం జరిగింది. దుంప నాటిన 15 రోజులకు ఇగురు రావటం ప్రారంభం అయ్యింది. దుక్కిలో ఏమీ అందివ్వలేదు. ఇగురు వచ్చిన తరువాత ప్రతి వారం రోజులకు ఒకసారి వేపనూనె మరియు వేస్ట్‌ డికంపోజరు కలిపి పిచికారి చేయటంతో పాటు ప్రతివారం ఎకరానికి 200 లీటర్ల చొప్పున వేస్ట్‌ డికంపోజరును డ్రిప్పు ద్వారా మొక్కలకు అందించడం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే పిందెలు రావటం మొదలయ్యింది. ఆ వచ్చిన పిందెలని ఎప్పటికప్పుడే తుంచి వేస్తున్నాడు. దొండ మొక్క పందిరి పైకి పాకే వరకు వచ్చిన పిందెలని తీసి వేస్తూ ఉంటారు.
ప్రత్తి, మునగ : మునగలో అంతర పంటగా ప్రత్తిని వేయటం జరిగింది. మునగ లైనుకి లైనుకి 8 అడుగులు మరియు మొక్కకు మొక్కకు 4 అడుగులు దూరం పాటించి స్థానికంగా కొనుగోలు చేసిన మునగ విత్తనాలను నాటించడం జరిగింది. రాశి కంపెనీ వారి ప్రత్తి విత్తనాలను మునగ లైన్ల మధ్యలో నాటించడం జరిగింది. ఈ రెండింటిని జూన్‌ చివరి వారంలో వేసుకోవడం జరిగింది. ఈ పొలంలో గత పంట రసాయన పద్ధతిలో ప్రత్తి పండించినాడు. ఈ సంవత్సరం దుక్కిలో రసాయనిక ఎరువులు అందించటం జరిగింది. మునగ మరియు ప్రత్తి మొక్కలు మొలిచిన తరువాత ప్రతి వారం వేపనూనెను మరియు వేస్ట్‌డికంపోజరు కలిపి పిచికారి చేయటంతో పాటు ఎకరానికి 200 లీటర్ల చొప్పున వేస్ట్‌డికంపోజరును భూమికి డ్రిప్పు ద్వారా అందించడం జరుగుతుంది.
వరి : మొత్తం 5 ఎకరాలలో వరిని సాగు చేస్తున్నాడు. ఒక ఎకరంలో బి.పి.టి మరియు 4 ఎకరాలలో ఆర్‌.ఎన్‌.ఆర్‌. 15048 రకాలను వేయడం జరిగింది.
బిపిటి : ఈ పొలంలో గత పంట కాలంలో ప్రత్తి వేయటం జరిగింది. 30 కిలోల బి.పి.టి వరి విత్తనాలను దుకాణంలో కొనుగోలు చేసి రోహిణి కార్తెలో నారు పోయటం జరిగింది. నారుమడికి కొద్ది మొత్తంలో పశువుల ఎరువుని అందించినాడు. వరి మొలక వచ్చిన తరువాత ప్రతి వారం వేస్ట్‌డికంపోజరును పిచికారి చేయడంతో పాటు భూమికి అందిస్తూ వస్తూ 32 రోజులు పెరిగిన నారుని ప్రధాన పొలంలో నాటించినాడు. వరి నారు నాటిన రోజు నుండి వారానికి ఒకసారి ఎకరానికి 200 లీటర్ల వేస్ట్‌డికంపోజరును నీటి ద్వారా మడిలో అందించటంతోపాటు, 5 లీటర్ల వేస్ట్‌డికంపోజరును 15 లీటర్ల నీటికి కలిపి వారానికి ఒకసారి పంటపై పిచికారి చేస్తూ వస్తున్నాడు. మధ్యలో ఒకసారి వరి పంటలో కొంత సమస్య తలెత్తడంతో నూరు శాతం వేస్ట్‌డికంపోజరు ద్రావణాన్ని పిచికారి చేయగా సమస్య పరిష్కారం అయినట్లు శ్రీనివాసరెడ్డి గమనించినాడు. సెప్టెంబరు 26వ తారీఖున ఈ వరికి 6 కిలోల వరి మొలకల పేస్ట్‌, వేస్ట్‌డికంపోజరులో వేపపిండి నానపెట్టిన ద్రావణం, ఆవుమూత్రం, లోపలి మట్టి, ఇవన్నీ కలిపి పిచికారి చేసినారు.
ఆర్‌.ఎన్‌.ఆర్‌ : 4 ఎకరాలకు గాను 100 కిలోల విత్తనాన్ని కొనుగోలు చేసి జూన్‌ ఆఖరున నారు పోసుకోవటం జరిగింది. నారుమడికి పశువుల ఎరువు అందించినాడు. నారుమడికి వేస్ట్‌డికంపోజురు ద్రావణాన్ని కూడా అందించినాడు. ప్రధానపొలంలో జీలుగను పచ్చిరొట్టగా వేసి పూత వచ్చే సమయంలో దమ్ము చక్రాలు మరియు కల్టివేటరుతో భూమిలో కలియదున్ని ఎకరానికి 200 లీటర్ల చొప్పున వేస్ట్‌ డికంపోజరు ద్రావణాన్ని అందించటం జరిగింది. 15 రోజుల తరువాత గమనించగా జీలుగ అంతా బాగా కుళ్ళడం జరిగింది. అదే సమయంలో 30 రోజులు పెరిగిన నారుని నాటించడం జరిగింది. నారు నాటిన తరువాత ప్రతి 15 రోజులకు ఎకరానికి 200 లీటర్ల వేస్ట్‌డికంపోజరును పిచికారి చేయటంతో పాటు, ప్రతి 15 రోజులకు ఒకసారి 5 లీటర్ల వేస్ట్‌డికంపోజరును 15 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేస్తూ వస్తున్నా
డు. 3వ పిచికారిలో 40 మి.లీ. లీటర్ల వేపనూనె కూడా కలిపి ఉపయోగించడం జరిగింది.
 పవర్‌ వీడరుతో కలుపు నివారణ
సేంద్రియ వ్యవసాయంలో ప్రధాన సమస్య కలుపు. కలుపు నివారణకు చాలా మొత్తంలో రైతులు డబ్బులు కూలీల కొరకు ఖర్చు చేయవలసి వస్తుంది. దానిని గమనించిన శ్రీనివాసరెడ్డి పవర్‌ వీడర్‌ గురించి తెలుసుకుని చిత్తూరు వెళ్ళి అక్కడ ప్రకాష్‌ సరఫరా చేస్తున్న కిసాన్‌ క్రాఫ్ట్‌ వారి పవర్‌ వీడరును పరిశీలించి కొనుగోలు చేయడం జరిగింది. దాని సహాయంతో మెట్ట పొలంలో లుపుని నివారించుకుంటున్నాడు.
ద్రావణాలను స్ప్రేయరు ద్వారా పంటలకు పంపించవచ్చు
సాధారణంగా ఏమైనా ద్రావణాలను డ్రిప్పు ద్వారా పంట పొలాలకు అందించాలంటే వెంచురిని రైతులు ఉపయోగిస్తుంటారు. వెంచురి అవకాశము లేని రైతులు ద్రావణాలను పంటలకు అందించడం కొంత రిస్కుతో కూడుకున్న పని. దానిని గమనించిన కొంతమంది రైతులు తైవాన్‌ స్ప్రేయర్‌ సహాయంతో ద్రావణాలను డ్రిప్పు ద్వారా పంపిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి కూడా ఇదేవిధంగా వేస్ట్‌డికంపోజరు ద్రావణాన్ని తన పంట పొలాలకు డ్రిప్పు ద్వారా అందిస్తున్నాడు. ఇందుకుగాను తైవాన్‌ స్ప్రేయరు డెలివరి వద్ద డ్రిప్పు లేటరల్‌ అమర్చేలా ఏర్పాటు చేసుకుని ఎక్కడ కావాలంటే అక్కడ ఈ స్ప్రేయర్‌లో బాగా వడబోసిన వేస్ట్‌డికంపోజరు ద్రాణాన్ని నింపి స్ప్రేయరు స్టార్ట్‌ చేసినట్లయితే చాలా సులభంగా డ్రిప్పు ద్వారా ఈ ద్రావణం మొక్కలకు అందుతుంది. ఇదేవిధానాన్ని శ్రీనివాసరెడ్డి పాటిస్తూ కొంతవరకు కూలీ ఖర్చులు తగ్గించుకుంటున్నాడు.
వ్యవసాయంలో ఖర్చులు తగ్గించుకునేలా తన సాగు పద్ధతులను శ్రీనివాస రెడ్డి కొనసాగిస్తున్నాడు. మరిన్ని వివరాలు 91772 11423 కి ఫోను చేసి తెలుసుకోగలరు.