Spread the love
ప్రకృతినేస్తం: వ్యవసాయం ఒక మూస పద్ధతిలో కాకుండా మారుతున్న పరిస్థితులను పరిశీలించుకుంటూ అవకాశం ఉన్నంత వరకు ఆ వచ్చే మార్పులను ఆకళింపు చేసుకుంటూ పంటల సాగు కొనసాగించ గలిగినపుడే రైతు నిలదొక్కుకోగలడు. అలాకాకుండా ఒకే మూస పద్ధతిని గుడ్డిగా పాటించినట్లయితే వ్యవసాయంలో విజయం సాధించటం కష్టమవుతుంది. ప్రస్తుతం మారుతున్న కాలమాన పరిస్థితులు మరియు సాంకేతికత అభివృద్ధి చెందిన నేటి పరిస్థితులలో సమాచారం చాలా వేగవంతంగా ప్రపంచ నలుమూలలకు చేరుతుంది. ఈ పరిణామాన్ని వ్యవసాయంలో  ఉపయోకరంగా రైతులు మలచుకుంటున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ బాటలోనే నడుస్తూ ఎప్పటికప్పుడు వ్యవసాయంలో వచ్చిన కొత్త పద్ధతులను ఉపయోగించుకుంటూ వరి పంటను సాగుచేస్తున్నాడు గుంటూరు జిల్లా చిర్రావూరుకి చెందిన నాగభూషణం.
నాగభూషణం మొత్తం 6 ఎకరాలలో వరి సాగు చేస్తున్నాడు. అందులో 4 ఎకరాలు రసాయన సేద్యం మరియు 2 ఎకరాలలో సేంద్రియ సేద్యం. రసాయన పద్ధతిలో

నాగభూషణం, సేంద్రియ రైతు
సాగు చేసే వరికి గాను 3 ఎకరాలలో హెచ్‌.ఎం.టి. ఒక ఎకరంలో యంటియు 1210 రకం వెయ్యటం జరిగింది. ఈ పొలం కౌలు పొలం. కౌలు సంవత్సరానికి ఎకరానికి 15 బస్తాల వడ్లు. యంటియు రకం వేసిన ఎకరంలో గత సంవత్సరం బిపిటి 5204 వరిని వేసి 75 కిలోల బస్తాలు 42 వరకు దిగుబడి సాధించటం జరిగింది.
హెచ్‌ఎంటి వరి : మూడు ఎకరాలలో జులై 22వ తారీఖున హెచ్‌ఎంటి వరి విత్తనాలను ఎదబెట్టడం జరిగింది. దుక్కిలో ఏమీ వెయ్యకుండా విత్తనాలు ఎదబెట్టిన 30 రోజులకు 3 ఎకరాలకు గాను 75 కిలోల యూరియా, 60 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌, 75 కిలోల డిఏపి అందించడం జరిగింది. ఇప్పటి వరకు పైపాటుగా క్లోరిఫైరిఫాస్‌ 50 ఇసి 750 మి.లీ., ఆగ్రోమిన్‌ మాక్స్‌ ఒక కిలో మరియు బూస్టర్‌ కలిపి ఒకసారి పిచికారి చేయటం జరిగింది.
యంటియు 1210 వరి : ఈ రకాన్ని కూడా ఒక ఎకరంలో ఎద బెట్టటం జరిగింది. దీనికి సెప్టెంబరు 12వ తారీఖున 50 లీటర్ల వేస్ట్‌ డికంపోజరుకు 12 రకాల జీవన ఎరువులు మరియు జీవశిలీంద నాశినులు ఒక్కొక్కటి ఒక్కొక్క లీటరు చొప్పున మరియు 50000 పిపియం ఎన్‌ఎస్‌కెఇ ద్రావణం ఒక లీటరు, లోపలి మట్టి 25 కిలోలు మరియు 3 కిలోల వరి మొలకల పేస్ట్‌ కలిపి ఒక ఎకరానికి అవసరమైన నీటిలో కలిపి పిచికారి చేయడం జరిగింది.
సేంద్రియ వరి : 2 ఎకరాలలో సేంద్రియ పద్ధతిలో వరి సాగు చేయడం జరుగుతుంది. ఇందుకుగాను నారాయణ కామిని రకం వరి విత్తనాలని ఆగస్టు 10న ఎదపెట్టడం జరిగింది. ఈ పొలంలో గత సంవత్సరం బిపిటి రకం వరిని రసాయన పద్ధతిలో పండించి ఎకరానికి 40 బస్తాల దిగుబడి సాధించటం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు ఏ విధమైన కషాయాలు ద్రావణాలు పిచికారి చేయలేదు. ముందు ముందు అవసరాన్ని బట్టి మట్టి ద్రావణం, వేస్ట్‌డికంపోజరు, ఎన్‌ఎస్‌కెఇ ద్రావణం, జీవన ఎరువులు, జీవశిలీంద్రనాశనులు అన్ని ఉపయోగించటానికి ప్రణాళిక వేసుకోవటం జరిగింది. పొలంలో కలుపు ఎక్కువగా ఉన్నందువలన కలుపు నివారణకు గరళకంఠ కషాయం సొంతంగా తయారు చేసుకుని పిచికారి చేయటం జరిగింది. ఈ విధంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తోటి రైతులకు భిన్నంగా నాగభూషణం వరిని సాగు చేస్తున్నాడు.
కలుపు నివారణకు గరళకంఠ కషాయం
సేంద్రియ వ్యవసాయంలో కలుపు నివారణకు ఎటువంటి రసాయనాలను ఉపయోగించకూడదు కనుక కలుపును కలుపుతోనే నివారించుకునే పద్ధతులను ఇటీవల రైతులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇందులో మిశ్రమ ఫలితాలు వస్తున్నవని రైతుల అనుభవాలు చెబుతున్నవి. నాగభూషణం తన రెండు ఎకరాల సేంద్రియ వరిలో ఈ పద్ధతిని చేయడం జరిగింది. ఇందుకుగాను తన వరి పొలంలో ఉన్న కలుపు రకాల అయిన ఊద, గరిక, తుంగ మొదలగు రకాలను ప్రక్క పొలం నుండి ఒక్కొక్కటి 2 నుంచి 3 కిలోలు సేకరించటం జరిగింది. మొత్తం 10 నుంచి 12 కిలోల కలుపు మొక్కలను సేకరించి వీటిని దబరా గిన్నెలో వేడి చేయగా 5 6 గంటలలో నల్లగా బూడిద తయారయ్యింది. ఈ బూడిదను ఎకరానికి 100 గ్రాముల చొప్పున రెండు ఎకరాలకు 200 గ్రాములు తీసుకుని దానికి 4 లీటర్ల నీటిని కలిపి ఒక సీసాలో పోసి సీసాకు మూతపెట్టి 3 రోజులు అంటే 72 గంటల పాటు రోజు రెండు, మూడు సార్లు కలుపుతూ ఉంటే 3వ రోజు ద్రావణం తయారవుతుంది. 4వ రోజు ఈ ద్రావణానికి 2 లీటర్ల గేదె పాలు, 400 గ్రాముల పంచదార కలిపి 34 రోజులు మరలా రోజుకు 23 సార్లు గిలకొట్టడం జరిగింది. అపుడు ఆ ద్రావణం బాగా నల్లగా తయారయ్యింది. ఈ విధంగా తయారైన ద్రావణం రెండు రోజుల తరువాత 400 లీటర్ల నీటిలో కలిపి ఆ డ్రమ్ముకు పట్టా కప్పి మూడు రోజులు అలాగే ఉంచి 4వ రోజు అనగా ఆగస్టు 3న 2 ఎకరాలలో పిచికారి చేయడం జరిగింది. 10 రోజుల తరువాత ఫొటోలు తీసిన రోజుకి ఉన్న ఫలితం ఏమిటనగా తుంగ చనిపోలేదు. గరిక, ఊద లాంటి రకాలు కొద్దిమొత్తంలో చనిపోవటం జరుగుతుంది. కొన్ని కలుపు మొక్కలు ఎర్రగా మారి వేరు లోపల ఉండి పైభాగం ఊడి వస్తుంది. కొన్ని మొక్కల వేర్లు ఊడి రాకుండా వేరు గడ్డిగా ఉంటుంది అని నాగభూషణం తన అనుభవాన్ని తెలియపరచారు.
మరిన్ని వివరాలు 9440056141 కి ఫోను చేసి తెలుసుకోగలరు.