Spread the love

ప్రపంచం మొత్తాన్ని పీడిస్తున్న అతి పెద్ద సమస్య కాలుష్యం. ప్రజల జీవనసరళి మారటం మరియు అనేక రకాల కారణాల వలన రోజురోజుకి వాతావరణ కాలుష్యం పెరుగుతుందనేది అందరూ అంగీకరించేదే. ప్రజలు అవసరాలను ప్రక్కకు నెట్టి అనుకరణలకు ప్రాముఖ్యతను ఇస్తూ అనవసర వస్తు వినియోగం పెంచడం, పారిశ్రామికీకరణ విపరీతంగా పెరగడం, జనాభా పెరగడం, విపరీతంగా ప్లాస్టిక్‌ వినియోగం, వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టటడం లాంటి అనేక రకాల కారణాల వలన కాలుష్యం పెరుగుతూ ఓజోన్‌ పొర క్షీణించి పోతుంది. ఈ కాలుష్యం ఇదే విధంగా కొనసాగితే ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని భావించి ప్రపంచ దేశాలు కాలుష్యాన్ని తగ్గించే దారులు వెతుకుతూ అటువైపు అడుగులు వేస్తున్నాయి. ఎవరు ఎన్ని మార్గాలు వెతికినా కాని అవి సామాన్య ప్రజలకు ఆమోదయోగ్యంగా, అనుకూలంగా ఉన్నప్పుడే విజయం సాధించగలవు లేనట్లయితే అనుకున్న ఫలితాలను సాధించాలంటే ఎంతో సమయం పడుతుంది. ఈ విషయం వ్యవసాయ వ్యర్థాల పునర్‌ వినియోగం విషయానికి వస్తే బాగా అర్థం చేసుకోవచ్చు. మన రైతులు పండించే ప్రత్తి, మిరప, కంది, గోధుమ తదితర పంటలను పంట దిగుబడి పొందిన తరువాత పంట వ్యర్థాల పునర్‌ వినియోగం కొంత ఖర్చు, శ్రమతో కూడుకున్న పని కాబట్టి ఎక్కువ మంది రైతులు తమ పంటల తాలూకూ వ్యవసాయ వ్యర్థాలను తగులబెడుతున్నారు. దీనివల్ల వాతావరణం కలుషితమవుతుంది. దానిని నివారించటానికి అనేకమంది తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. కాని విజయం సాధించిన వారు చాలా తక్కువ మంది మాత్రమే. ఆ తక్కువ మందిలో ప్రకాశం జిల్లా కురిచేడుకు చెంది కమలాకరరావుఉండటం విశేషం.

వ్యవసాయ నేపథ్యానికి చెందిన కమలాకరరావు వకీలు చదువు పూర్తి చేసి హైదరాబాదులో అదే వృత్తిలో కొనసాగుతున్నారు. తన వృత్తిని కొనసాగిస్తూనే సమాజాన్ని గమనిస్తూ జరిగే పరిణామాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవారు. ఈ క్రమంలో కాలుష్యం గురించి తన ఆలోచనను మరల్చడం జరిగింది. వాతావరణ కాలుష్యం రోజురోజుకి పెరుగుతుంది. దీనిని తగ్గించటానికి తన వంతుగా ఏదైనా చేయాలని ఆలోచిస్తుండగా వ్యవసాయ వ్యర్థాలను రైతులు తగలబెట్టటం ప్రతినిత్యం జరుగుతున్న కారణంగా ఢిల్లీలాంటి మహానగరాలలో కాలుష్యం పెరిగిపోతుందనే విషయం గ్రహించడం జరిగింది. దానికి పరిష్కార మార్గం కొరకు ఆలోచించాలని తలచి ఆ దిశలో తన మనసును కేంద్రీకరించి వ్యవసాయ వ్యర్థాలను తిరిగి మరలా భూములలో ఉపయోగించగలిగితే ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు భూమికి పోషకాలను అందించగలుగుతామని గ్రహించి అందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించడం జరిగింది. తాను సేకరించిన సమాచారం ప్రకారం వ్యవసాయ వ్యర్థాలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి దానిని కుళ్ల గొడితే అది మంచి సేంద్రియ ఎరువుగా తయారయి భూమిని సారవంతం చేయటానికి బాగా ఉపయోగపడుతుందని తెలుసుకుని కత్తిరించే ఆ దిశగా ముందుకు నడిచారు.

వ్యవసాయ వ్యర్థాలను ముక్కలుగా కట్‌ చేసే యంత్రాలు సరైనవి మనకు అందుబాటులో లేవు. అందుబాటులో ఉన్న పరికరాలు అంత ఉపయోగకరంగా లేవు. కాబట్టి పంజాబ్‌లోని యంత్ర పరికరాల వారితో సంప్రదించి అనుకూలమైన చాఫ్‌కట్టర్‌ని సొంత డబ్బులతో కొనుగోలు చేసి కురిచేడులోని తన సొంత పొలంలో అమర్చి వ్యవసాయ వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు.

వాస్తవంగా కమలాకరరావు వ్యవసాయ రంగానికి దూరంగా ఉంటున్నా కూడా జరిగే వినాశనాన్ని గమనించి తనవంతుగా ప్రయత్నం చేయాలని తలచి చేస్తున్న వకీలు వృత్తిని వదిలి అర్థాంగి సహకారంతో వ్యవసాయ రంగంలో అడుగుపెట్టడం జరిగింది. తన ఈ నిర్ణయం వలన భాగ్యనగరాన్ని వదలి నెలలో కనీసం 15 రోజులు పల్లెబాట పట్టవలసినా కూడా ఏలాంటి వెనుకంజ వేయకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించటానికి ముందుకు నడుస్తున్నారు. ఇందుకు గాను తన సొంత ఖర్చుతో సుమారు రెండు లక్షల డెబ్బైఅయిదు వేలు ఖర్చు పెట్టి పంజాబ్‌ నుంచి చాఫ్‌కట్టర్‌ని తెప్పించారు. ఈ చాఫ్‌ కట్టర్‌తో కంది, పత్తి, మిరపలాంటి పంట వ్యర్థాలను చిన్న చిన్న ముక్కలుగా కట్‌చేసి వాటిని ఒక పద్ధతి ప్రకారం కుళ్ళపెట్టి మంచి సేంద్రియ ఎరువుగా మార్చుతూ వ్యవసాయ వ్యర్థాలను అర్ధవంతంగా మార్చుతూ సమాజానికి మార్గదర్శిగా నిలుస్తున్నారు.

వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారీ

చాఫ్‌కట్టర్‌ని 45 హార్స్‌పవర్‌ గల ట్రాక్టరుకు అనుసంధానం చేసి వ్యవసాయ వ్యర్థాలను చిన్న చిన్న ముక్కలుగా చేయడం జరుగుతుంది. ఇందుకు గాను 7 నుంచి 9 మంది వరకు కూలీలు అవసరం పడుతుంది. అందులో ముగ్గురు మగవారు, 6 మంది ఆడవారిని నియమించినారు. ఈ చాఫ్‌కట్టర్‌ పచ్చివి మరియు ఎండిన వ్యవర్థాలను ముక్కలుగా చేయటానికి అనుకూలం. 8 గంటలలో 8 టన్నుల వరకు వ్యర్థాలను ముక్కలుగా చేస్తుంది. 8 టన్నులను కుళ్ళింపగా 5 నుంచి 6 టన్నుల సేంద్రియ ఎరువు తయారు అవుతుంది. పంట వ్యర్థాలను తోటి రైతుల వద్ద నుంచి ఉచితంగా సేకరించుకొని సొంత ఖర్చులతో ట్రాక్టరుతో తోలుకుంటున్నారు. చాఫ్‌కట్టర్‌తో ముక్కలు చేసిన వ్యర్థాలను 8 టన్నులు ఒక కుప్పలాగా పోసి దానిపై 1000 కిలోల (రూ. 400/ ) నల్లమట్టిని లేదా చెరువు మట్టిని పోస్తుంటారు. దానిపై 60 కిలోల వేప విత్తనాలను 500 లీటర్ల  నీటిలో నానపోసి 24 గంటల తరువాత తయారైన కషాయాన్నిపోస్తారు. మరలా అదే విత్తనాల డ్రమ్ములో నీరు నింపి మరలా ఆ ద్రావణాన్ని 24 గంటల తరువాత ఆకుప్పపై పోస్తారు. ఈ విధంగా మూడుసార్లు అంటే 60 కిలోల వేప విత్తనాలతో 1200 లీటర్ల వేప కషాయాన్ని తయారు చేసుకుని 3 దఫాలుగా పోస్తారు. దానితోపాటు ప్రతిరోజు 200 లీటర్ల చొప్పున వేస్ట్‌ డికంపోజరు ద్రావణం మరియు 500 కిలోల ఏదైనా పశువుల పేడ వేసి నీటిని అందిస్తారు. కుప్పలో తేమ శాతం ఉండేలా కుప్పపై నీటిని అందిస్తుంటారు. ఈ విధంగా అందుబాటులో ఉన్న వ్యర్థాలను బట్టి 3 రోజులలో వచ్చిన వ్యర్థాలను 24 నుంచి 27 టన్నుల సామర్థ్యం గల కుప్పలను వేస్తుంటాడు. ఈ కుప్పపై రోజు నీటిని అందిస్తూ 20 రోజులు గడిచిన తరువాత 20 నుంచి 25 రోజుల మధ్యలో జెసిబి సహాయంతో తిరగకొట్టడం జరుగుతుంది. 26వ రోజు కుప్పను చదునుగా చేసి 15 రోజులకు అంటే 40వ రోజు వరకు అలా వదలి వేస్తుంటారు. 40 రోజుల తరువాత ఆ కుప్పపై ట్రైకోడెర్మావిరిడి, సూడోమోనాస్‌, మెటారైజియమ్‌, అజటోబాక్టర్‌, ఫాస్ఫోబాక్టీరియా మొదలగు జీవ సంబంధ ఎరువుల మిశ్రమాన్ని 400 లీటర్లు మరియు వేస్ట్‌డికంపోజరు ద్రావణాన్ని 200 లీటర్లు కుప్పపై అందించి జెసిబి తో కలిపి ప్రతిరోజు అవసరాన్ని బట్టి నీటిని అందిస్తే 20 రోజులకు అంటే మొత్తం 60 రోజులకు మంచి సేంద్రియ ఎరువు తయారవుతుంది. ఈ ఎరువుని ఎప్పుడైనా పొలంలో ఉపయోగించవచ్చు. కాని పొలంలో ఉపయోగించటానికి 10 రోజుల ముందు 1000 కిలోల ఎరువుకు వేస్ట్‌డికంపోజరు మరియు జీవన ఎరువుల మిశ్రమాన్ని 150 నుంచి 200 లీటర్లు కలిపి 10 రోజుల తరువాత పొలంలో ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందని కమలాకరరావు తెలియచేస్తున్నారు.

మన నేలలలో సేంద్రియ కర్బనం తగ్గిపోతుంది

6 దశాబ్దాల క్రితం మన నేలలలో సేంద్రియ కర్బనం 4 నుంచి 6 శాతం వరకు ఉండేది. కాని హరిత విప్లవం ప్రవేశించిన తరువాత రసాయనాల ప్రభావం వలన సేంద్రియ కర్బనం తగ్గుతూ నేటికి కొన్ని నేలలలో 0.5 శాతానికి తగ్గింది. అడవులలో 3 నుంచి 3.5 శాతం ఉంది కాని పంట పొలాలలో 0.5 శాతం కన్నా తక్కువగా ఉంటుంది. 5 నుంచి 0.5 శాతానికి పడిపోవటానికి సు

మారు 60 సంవత్సరాలు పడితే ఈ 0.5 శాతం కూడా కొన్ని సంవత్సరాలలో తరిగిపోతుంది. అపుడు మన నేలలు ఏ మాత్రం పంటలకు అనుకూలం కావు. ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలుపెడితే తిరిగి పూర్వ వైభవం రావటానికి కనీసం 40 నుంచి 50 సంవత్సరాలు పడుతుంది. కాని దానిని ఎవరూ ఆర్థం చేసుకుంటున్న లక్షణాలు కనిపించడం లేదు. అన్నింటికి పరిష్కారం పొలంలో ఎక్కువగా ఎరువులు, పచ్చిరొట్ట పైర్లు వేసినా కూడా ఫలితాలు అంత తొందరగా రావు కాని వ్యవసాయ వ్యర్థాలతో తయారైన సేంద్రియ ఎరువును తగు పరిమాణంలో అందిస్తుంటే 3 సంవత్సరాలలో సేంద్రియ కర్బనాన్ని 3 శాతం వరకు పెంచవచ్చు అని కమలాకరరావు అభిప్రాయ పడుతున్నాడు.

కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి

ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి అనే విషయం అందరికీ తెలిసిందే. మిగతా రంగాలతో పోలిస్తే వ్యవసాయ రంగంలో కుటుంబసభ్యుల సహకారం అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రత్యేకించి కుటుంబంలోని ఆడవారు వ్యవసాయరంగం అంటే అయిష్టంగా ఉంటున్నారు. అందువలననే చాలామంది మగవారు తమకు ఇష్టం ఉన్నా కూడా ఆకుటుంబంలోని ఆడవారికి వ్యవసాయ రంగం అంటే ఇష్టం లేకపోవడం వలన అటువైపు ఆలోచించలేకపోతున్నారు. అందుకు అనేక కారణాలు. వ్యవసాయరంగం అంటే గ్రామాలలో ఉండాల్సిరావడం ప్రధాన కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితులలో అతికొద్దిమంది మహిళలు వ్యవసాయ రంగం అంటే ఇష్టంతో తమ కుటుంబ సభ్యులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. కమలాకరరావు గారి అర్థాంగి లక్ష్మి తన భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయ రంగంలో అడుగుపెట్టడాన్ని ప్రోత్సహించింది. ఇందుకు గాను నెలలో 15 రోజులు హైదరాబాదులో, మిగిలిన 15 రోజులు కురిచేడులో ఉంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగడం విశేషం.

భూమి బాగుపడితేనే రైతు బాగుపడతాడు : ప్రకృతి రైతు కమలాకర్ రావు

కారణాలు ఏమైనా కాని ప్రస్తుతం మన దేశంలోని వ్యవసాయ భూములన్నీ కూడా పాడైపోతున్నవి అనే విషయం అందరికీ తెలిసిందే. భూమి బాగుపడకుండా రైతు బాగుపడరు కాబట్టి తప్పనిసరిగా భూమిని బాగుపరచుకోవాలి. భూమిని బాగుపరచుకోవాలంటే పంట వ్యర్థాలను తిరిగి భూమికి అందిచటంతో పాటు వివిధ రకాల సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అమలు పరుస్తూ రసాయనాలకు దూరంగా ఉండాలి. భూమి బాగుపడితేనే రైతు బాగుపడతాడు. రైతు బాగుపడితేనే దేశం బాగుపడుతుందని కమలాకరరావు వివరిస్తున్నారు. మరిన్ని వివరాలు 98481 78232 కి ఫోను చేసి తెలుసుకోగలరు.