Spread the love

ఆనాటి విధానాలను వదిలి దారితప్పిన వ్యవసాయం.. ప్రకృతిని నాశనం చేస్తోంది. రసాయన ఎరువులు, పురుగు మందులతో పంటల సాగు వల్ల భూమి, నీరు, గాలి కలుషితం అవుతున్నాయి. ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. సమాజంపై పెను భారం పడుతోంది. అందుకే ఇప్పుడు మన ముందున్నది ఒకే దారి. అదే ప్రకృతితో కలిసి నడవటం. ఆ బాటలో వెళితేనే మానవ జీవనానికి సమతుల్యం దక్కుతుంది. సంతోషం చేరువవుతుంది. పుడమి తల్లి పరవశిస్తుందని అంటారు విజయవాడకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు రాయని పోత రాజ్ కుమార్. వ్యవసాయ కుటుంబ నేపథ్యం కాకపోయినా, సాగుపై మక్కువతో, సమాజంపై బాధ్యతతో ఆయన ప్రకృతి వ్యవసాయంలోకి అడుగుపెట్టి.. నేడు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంక్షేమ సంఘం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను విక్రయిస్తు సుస్థిర ఆదాయం పొందటమే కాకుండా సమాజానికి సహజ ఆహారం అందిస్తున్నారు. 3 ఎకరాల భూమిని కౌలుకి తీసుకొని, 11 భాగాలుగా విభజించి 24 రకాల పంటలు పండిస్తు.. విభిన్న వ్యవసాయ మోడల్ ని పరిచయం చేస్తున్నారు.

భిన్నంగా ఆలోచిస్తే వ్యవసాయంలోనూ అనేక లాభసాటి పద్ధతులు కనిపిస్తాయి. వాటిని ఆచరణలో పెట్టి శ్రమిస్తే.. మంచి ఫలితాలు మన సొంతం అవుతాయి. ఈ సూత్రాన్నే పాటిస్తు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో 24 పంటల సాగుతో మంచి లాభాలు పొందుతున్నారు విజయవాడకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు రాయన పోత రాజ్ కుమార్. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబ నుంచి రాలేదు. కానీ పంటలు సాగు అంటే అమితాసక్తి. పీఆర్వోగా పనిచేస్తున్న సమయంలోనే ఆ ఆసక్తితో మిద్దెతోటలు సాగు చేశారు. సేంద్రియ విధానంలో సొంతింటి పంటలు పండించారు. ఉద్యోగానికి స్వస్తి పలికిన తర్వాత పూర్తిగా కర్షకుడిగానే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఓ మిత్రుడి ద్వారా నున్నలో కౌలు భూమి గురించి తెలుసుకున్నారు. ప్రత్యక్షంగా పరిశీలించి.. భూమిని కౌలు తీసుకున్నారు. అప్పటి వరకు అరటి సాగు చేసిన ఆ భూమిలో ప్రకృతి వ్యవసాయ విధానంలో వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు సాగు చేయాలని సంకల్పించారు. అరటి చెట్లను తీసి బయటపారేయకుండా 3 నెలల పాటు శ్రమించి భూమిలోనే కలిసేలా చేశారు. తద్వారా నేల సారాన్ని పెంచారు. 3 ఎకరాల్లో తొలుత రెండున్నర ఎకరాల్లో సాగుకి శ్రీకారం చుట్టారు.

అంతర్ పంటల సేద్యం

రాజ్ కుమార్ ది శ్రమించే తత్వం. గతంలో వ్యవసాయంపై అంతగా పట్టులేకపోయినా.. తక్కువ కాలంలోనే స్నేహితులు, శిక్షణా తరగతుల ద్వారా సాగు మెళకువలు అవపోసన పట్టారు. వీటికి విభిన్న ఆలోచనలను జోడించి ముందడుగు వేశారు. కౌలుకి తీసుకున్న భూమిని భాగాలుగా విభజించి.. ఒక్కో దాంట్లో ఒక్కో పంటను వేశారు. ఇలా వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, ధాన్యం పంటలు వేశారు. సొరక్కాయ, బెండకాయ, టమాట, పాలకూర, తోట కూర, మెంతి కూర, క్యారెట్, ముల్లంగి, బీట్ రూట్, పచ్చి మిర్చి, క్యాబేజీ, కాలీఫ్లవర్, మొక్కజొన్న, కీర దోస, పుచ్చకాయ తదితర పంటలను ఎలాంటి రసాయనాలు లేకుండా సహజ పద్ధతుల్లో పండిస్తున్నారు. వ్యవసాయంలో ఎదురయ్యే ఆటుపొట్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. కూరగాయల సాగులో కలుపు సమస్య తీవ్రంగా ఉంటుంది. దీన్ని నివారించేందుకు రాజ్ కుమార్ అంతర్ పంటలను వేశారు. ఒక్కో ప్రధాన పంటలో అంతర్ పంటగా ఇతర పంటలను వేసి కలుపుని సమర్థంగా అడ్డుకుంటున్నారు. ఈ విధానంలో కలుపుని పూర్తిగా నిర్మూలించవచ్చని, తద్వారా ఎలాంటి రసాయనాలు వాడాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు రాజ్ కుమార్. పంటలని ప్రతి రోజు పరిశీలిస్తారు. నీరు పెట్టడం, సహజ ఎరువులు అందించటం, పంట ఉత్పత్తులు సేకరించటం వంటి అన్ని పనులని స్వయంగా ఆయనే చేస్తారు. ఇలా మొక్కల మధ్య జీవనం మనసుని ఆహ్లాదపరుస్తుందని, తద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందని అంటారు రాజ్ కుమార్.

సొంతంగా సహజ ఎరువుల తయారీ

పంటల పోషణ, చీడ పీడల నివారణ కోసం డ్రిప్ ద్వారా జీవామృతం, వేస్ట్ డీ కంపోజర్ పారిస్తున్నారు. నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం తదితర కషాయాలను వాడుతున్నారు. ఎగ్ ఎమైనో ఆసిడ్స్, ఫిష్ ఎమైనో ఆసిడ్స్ సొంతంగా తయారు చేసుకుంటున్నారు.

ఎగ్ ఎమైనో ఆసిడ్స్ కోసం పది నుంచి 15 గుడ్లు తీసుకోవాలి. ఒక డబ్బాలో వాటిని వేసి అవి పూర్తిగా నిండిపోయే విధంగా నిమ్మరసంతో నింపాలి. పది రోజులు పక్కకు పెట్టాలి. ఇలా ఎగ్ ఎమైనో ఆసిడ్ తయారవుతుంది. ఎకరానికి 250 ML ఎగ్ ఎమైనో ఆసిడ్స్ ని వంద లీటర్ల నీటిలో కలిపి పంటలకు స్ప్రే చేయాలి. పంటల్లో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు అల్లం బెల్లం, వెళ్లుల్లి బెల్లం, దాల్చిన చెక్కకల్లు ద్రావణాలను వాడుతుంటాం. ఇవి పంటలకు చీడ పీడలు సోకకుండా రక్షిస్తాయిఅని పోత రాజ్ కుమార్ వెల్లడించారు. ఇలా రైతులు సొంతంగా సహజ ఎరువులను తయారు చేసుకొని పంటలకు అందిస్తే పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని, అలాగే పంట దిగుబడులు కూడా ఆశించిన స్థాయిలో వస్తాయని వివరించారు.

అమరావతి ఆర్గానిక్స్ ద్వారా ఉత్పత్తుల విక్రయం

ఎంతో మందిని ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహిస్తోన్న గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంక్షేమ సంఘంలో పోత రాజ్ కుమార్ వ్యవస్థాపక సభ్యుడు. దీని కిందే అమరావతి ఆర్గానిక్స్ అనే మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రకృతి వ్యవసాయ రైతుల నుంచి పంట ఉత్పత్తులను సేకరించి వాటిని మార్కెట్లో విక్రయించే బాధ్యతలను అమరావతి ఆర్గానిక్స్ అమలు చేస్తుంది. రైతుల నుంచి గిట్టుబాటు ధరలకు పంటలను కొనుగోలు చేసి వాటిని వినియోగదారులకు అందిస్తుంది. తద్వారా రైతుకి, వినియోగదారుడికి మేలు జరుగుతుంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో చాలా మంది రైతులు ఈ సొసైటీకి తమ ఉత్పత్తులను చేరవేస్తున్నారు. ప్రస్తుతం ఈ సొసైటీకి 3 విక్రయ ఔట్ లెట్లు, ఒక మొబైల్ వ్యాన్ ఉన్నాయి. ఉదాహరణకి ఓ పంట ఉత్పత్తులని రైతుకి కిలో రూ.30 చెల్లించి కొనుగోలు చేసి.. ఔట్ లెట్లో రూ.40కి వినియోగదారులకి విక్రయిస్తారు. ఇలా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లకు మార్కెట్లో ఉన్న ధరలకు అనుగుణంగా రైతుకి గట్టుబాటు, అలాగే వినియోగదారులకి అందుబాటులో ఉండేలా అమరావతి ఆర్గానిక్స్ పనిచేస్తుందని రాజ్ కుమార్ తెలిపారు. రోజు వారి ఉత్పత్తులను రైతులే నేరుగా తీసుకెళ్లి సొసైటీలో ఇచ్చివస్తారని, ఇలా సుస్థిర ఆదాయం అందుతోందని వివరించారు.

ఇలా ప్రకృతి వ్యవసాయంలో విజయవంతంగా సాగుతు, తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్న రాజ్ కుమార్ ప్రశంసలు పొందారు. జీకొండూర్ మండల స్థాయిలో ఉత్తమ సేంద్రియ రైతు అవార్డు అందుకున్నారు. పర్యావరణ, సమాజ ఆరోగ్య సంరక్షణలో భాగమవడమే కాకుండా తోటి రైతులని సహజ సేద్యం దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఏ రంగంలో అయినా సవాళ్లు ఉన్నట్లుగానే, ప్రకృతి వ్యవసాయంలోను కొన్ని ఆటుపొట్లు ఎదురవుతాయనిశ్రమ, నిత్య పర్యవేక్షణ, సాధించాలన్న పట్టుదలతో వాటన్నింటిని సమర్థంగా ఎదుర్కోవచ్చని రాజ్ కుమార్ చెబుతారు. ప్రకృతి వ్యవసాయంలో ఆయన అవలంబిస్తున్న విధానాలను తెలుసుకోవాలని అనుకునే వారు, కూరగాయల సాగుపై ఆసక్తి ఉన్న వారు, నున్నలో పళ్లతిప్ప రోడ్డులో ఉన్న తన ఆర్గానిక్ ఫార్మ్ కి రావచ్చంటూ రైతు సోదరులను రాజ్ కుమార్ ఆహ్వానిస్తున్నారు.

ఏడాది పొడవునా ఆదాయం : ప్రకృతి రైతు రాజ్ కుమార్

ఈ ప్రకృతి, సమాజం మనకు ఎన్నో ఇచ్చాయి. వాటిలో కొంతైనా తిరిగి ఇవ్వాలన్నది నా ఆపేక్ష. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఆసక్తితో పాటు సామాజిక బాధ్యత కూడా నెరవేరుతుందన్న విశ్వాసంతో ప్రకృతి వ్యవసాయంలోకి అడుగుపెట్టాను. సుభాష్ పాలేకర్ శిక్షణా తరగతులకు హాజరయ్యాను. సాగు మెళకువలు తెలుసుకున్నాను. కూరగాయలనే ప్రధాన పంటలుగా ఎంచుకొని సహజ సేద్యం ప్రారంభించాను. కౌలుకి తీసుకున్న భూమిని భాగాలుగా విభజించి 24 రకాల పంటలు వేశాను. ప్రతి ప్రధాన పంటలో అంతర్ పంటలను కూడా వేశాను. ఈ తరహా సేద్యం వల్ల ఏడాడి పొడవునా పంటల నుంచి దిగుబడులు పొందవచ్చు. అంటే రైతుకి నిత్యం ఆదాయం అన్నమాట. ఇక గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోని అమరావతి ఆర్గానిక్స్ నుంచి మాకు సుస్థిర ఆదాయం అందుతోంది. అందుకే మా సాగు సుస్థిర వ్యవసాయంగా విజయవంతంగా సాగుతోంది. ఇలాంటి విధానాలు, వ్యవస్థలు చిన్న, సన్నకారు రైతులకి ఎంతో మేలు చేస్తాయి. రసాయనాలతో వ్యవసాయం భారీ ఖర్చుతో కూడుకున్నది. అలాగే అది పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. దేశంలో ప్రస్తుత వ్యవసాయ సంక్షోభానికి రసాయన ఎరువులు కూడా ప్రధాన కారణం. అందుకే రైతు లోకం ఇప్పటికైనా ఆ విధానాలకు స్వస్తి పలకాలి. ప్రకృతి చూపిన బాటలో అడుగేసి సహజ వ్యవసాయం చేయాలి. ప్రభుత్వాలు కూడా ఇలాంటి రైతులని ప్రోత్సహించి, ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు సేకరించే వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. అప్పుడే పర్యావరణం పదిలంగా, ప్రజల ఆరోగ్యం క్షేమంగా ఉంటాయి.