Spread the love

రైతుబంధు పథకం కింద రైతులకిచ్చిన చెక్కులను బ్యాంకుల్లో నగదుగా మార్చుకునేందుకు చెల్లుబాటు గడువు తేదీని మరో 3 నెలలు పొడిగించినట్లు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు. రైతుబంధు, రైతుబీమా పథకాల అమలుపై ఆగస్టు 3న బ్యాంకర్లు, ఎల్‌ఐసీ అధికారులతో సచివాలయంలో ఆయన సమీక్ష జరిపారు. రైతుబంధు చెక్కులను మూడు దఫాలుగా గత ఏప్రిల్‌, మే నెలల్లో ముద్రించారు. తొలి దఫా కింద ఏప్రిల్‌ 19వ తేదీతో, రెండో దఫాగా మే 1వ తేదీతో ముద్రించిన చెక్కుల 3 నెలల చెల్లుబాటు గడువు ముగిసింది. ఇప్పటికీ లక్షలాది చెక్కులు బ్యాంకులో జమకానందు వాటిని బ్యాంకులో డిపాజిట్‌ చేసి మార్చుకునేందుకు వీలుగా మరో 3 నెలల పాటు చెల్లుబాటు అయ్యేలా చూడాలని బ్యాంకర్లను కోరగా అంగీకరించారని ఆయన తెలిపారు. గడువు తేదీ ముగిసిన చెక్కులను ఈ నెల 10 తరవాత సమీపంలోని బ్యాంకుల్లో జమచేయాలని రైతులకు పార్థసారథి సూచించారు. రైతు జీవితబీమా పథకం కింద బీమా పత్రాలను ఈ నెల 6 నుంచి 13 వరకు గ్రామసభలను ఏర్పాటుచేసి పంపిణీ చేయాలని ఆదేశించారు. బీమా చేసిన రైతుల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.