Spread the love

టీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. శాస‌న‌స‌భ‌లో ముఖ్యమంత్రి హోదాలో సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 22రూ.1,82,017 కోట్లతో తాత్కాలిక బడ్జెట్ 2019 -20 ప్రవేశపెట్టారు. తద్వారా స్వరాష్ట్రంలో బడ్జెట్ ప్రసంగం చేసిన‌ తొలి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు.

ఈసారి బడ్జెట్‌లో సాగునీటి రంగానికే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఎన్నికల హామీల అమలుతో పాటు సాగునీరు, తాగునీరు, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు 2019-20 బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేశారు. రైతుల‌ రుణ‌మాఫీ అంశంలో ఇప్పటి వ‌ర‌కు ఏ తేదీని కటా‌‌‌‌‌ఫ్‌‌‌‌‌గా తీసుకుంటారు? ఎప్పటివరకు రుణ మాఫీ అమలు చేస్తారు? ఒకే దఫాలో చేస్తారా? గతంలో చేసినట్లుగా నాలుగు దఫాలుగా చేస్తారా? వంటి సందేహాలు రైతుల్లో నెల‌కొన్నాయి. తాజాగా రైతు రుణాలు మాఫీపై బ‌డ్జెట్‌లో సీఎం రైతులకు స్పష్టత ఇచ్చారు. 2018 డిసెంబర్ 11లోపు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామ‌ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతంలో మాదిరిగా నాలుగు దఫాలుగా రుణ‌మాఫీ చేయ‌నున్నారు. ఈ మేరకు ఈ బడ్జెట్ లో రైతురుణ మాఫీకి రూ.6 వేల కోట్లు కేటాయించారు. రైతు బంధు పథకం కింద ప్రస్తుతం ఎకరానికి పంటకు ఇస్తున్న రూ. 4 వేల మొత్తాన్ని రూ. 5 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించిన సీఎంరైతుబంధు పథకం కోసం ఈ బడ్జెట్ లో రూ. 12,000 కోట్ల రూపాయలు కేటాయించారు.

రైతు బీమా పథకం కింద ఇప్పటి వరకు 5,675 మంది రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున రూ. 283 రూపాయలు అందించినట్లు బడ్జెట్ లో పేర్కొన్నారు. ఈ బడ్జెట్ లో రైతు బీమా కోసం రూ. 650 కోట్ల కేటాయించారు. ఇకరాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నెలకొన్న వ్యవసాయానుకూల వాతావరణ, పర్యావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని రాష్ట్రాన్ని అనేక పంట కాలనీలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రజల అవసరాలకు అనుగుణమైన పంటలు, దేశ విదేశాల్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు పండించేలా చేయడమే ఈ క్రాప్ కాలనీల లక్ష్యం. తద్వారా ప్రస్తుతం గిట్టుబాటు ధర కోసం రైతులు పడుతున్న బాధలను అధిగమించడానికి వీలవుతుంది. ఈ పథకాన్ని అమలు చేసే క్రమంలో చిన్న, మధ్య తరహా, భారీ ఆహార శుద్ధి కేంద్రాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి నిర్వహణలో రాష్ట్రంలో పనిచేస్తున్న ఐకేపీ ఉద్యోగులు, ఆదర్శంగా పని చేస్తున్న మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తుందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు పంట కాలనీల అభివృద్ధి, తదితర పథకాల అమలుకు చరిత్రలోనే మొదటి సారిగా రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ శాఖకు రూ. 20,107 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు.

రైతుల‌కు పెద్ద పీట..

రైతు బంధు పథకానికి రూ.12000కోట్లు
రైతు రుణమాఫీకి రూ.6వేల కోట్లు

రైతు బీమా రూ. 650 కోట్లు
మిషన్ కాకతీయకు(నీటిపారుద‌ల‌శాఖ‌) రూ.22,500కోట్లు
వ్యవసాయశాఖకు రూ.20,107 కోట్లు