Spread the love

రైతునేస్తం: కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతులకు పెద్ద పీట వేసింది. తెలంగాణ ప్రభుత్వ బాటలోనే కేంద్రం కూడా రైతుబంధు వంటి పథకాన్ని ప్రవేశపెట్టనుందన్న అంచనాలను నిజం చేస్తూ.. తాజా బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పేరిట సరికొత్త పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 5 ఎకరాల లోపు (2 హెక్టార్లు) సాగు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6 వేల పెట్టుబడి సాయం అందించనుంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున నేరుగా రైతు ఖాతాలోకి బదిలీ చేస్తామని బడ్జెట్ లో పేర్కొంది. 2018 డిసెంబర్ 1 నుంచే ఈ పథకం అమల్లోకి వచ్చినట్లు ఆర్థిక మంత్రి గోయల్‌ ప్రకటించారు. ఈ పథకం అమలుకై ఏడాదికి రూ.75వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతీ రైతుకూ ప్రతీ పంటకూ ఖరీఫ్, రబీలో ఎకరాకు రూ.4000 చొప్పున వారి ఖాతాల్లో నేరుగా జమ అయ్యేలా ‘రైతు బంధు’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ ఏడాది నుంచి ఎకరానికి మరో వెయ్యి పెంచుతూ రూ.5 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇదే రీతిలో ఒడిశా సర్కారు సైతం కలియా (కృషక్‌ అసిస్టెన్స్‌ ఫర్‌ లైవ్లీహుడ్‌ అండ్‌ ఇన్‌కమ్‌ ఆగ్మెంటేషన్‌) పేరుతో రైతుపెట్టుబడి సాయం పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద ఒక రైతు కుటుంబానికి వార్షికంగా రూ 10,000 చొప్పున జమ చేస్తారు. ఎంత పొలం..? ఎవరెవరు హక్కుదారులు.. అన్న అంశాల జోలికి పోకుండా రైతు పేరిట జమ అయిపోతుంది. కొద్దిపాటి పొలం ఉన్న వారికీ, కౌలుదార్లకీ కూడా వర్తించేట్లుగా దీన్ని రూపొందించారు. వీటన్నింటినీ రంగరించి తాజా బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పేరిట సరికొత్త పథకాన్ని ప్రకటించింది.

ఏంటీ పథకం!
* పంట సాగుకు విత్తనాలు, ఎరువులు కొనాలన్నా రైతు అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది.
* అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగే చిన్న, సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకోవడమే ప్రధాన లక్ష్యంగా మోదీ సర్కారు ఈ పథకాన్ని ప్రకటించింది.
* రెండు అంతకన్నా తక్కువ హెక్టార్ల (5 ఎకరాలు) భూమిని సాగు చేసుకుని జీవిస్తున్న రైతు కుటుంబాలకు ఆర్థిక అండ అందించేందుకు ఈ పథకం తీసుకొచ్చారు.

ఎప్పటి నుంచి అమలు.. ప్రయోజనం ఏంటి?
* 01-12-2018వ తేదీ నుంచి ఈ పథకం వర్తించనుంది. దీని ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6000 నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమచేస్తారు.
* మొత్తం మూడు సమాన వాయిదాల్లో రూ.2వేలు చొప్పున ఈ మొత్తాన్ని ప్రభుత్వం రైతు ఖాతాల్లో వేస్తుంది.

ఎంతమంది లబ్ధి పొందుతారు
* దేశవ్యాప్తంగా ఉన్న 12కోట్ల సన్న, చిన్నకారు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.
* తొలి విడతలో భాగంగా 1 డిసెంబరు 2018 నుంచి 31 మార్చి 2019 మధ్యకాలానికి రూ.2వేలు రైతుల ఖాతాలో జమ కానుంది.
* ఈ పథకం అమలుకై ఏడాదికి రూ.75వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌
దేశంలో గో సంపదను పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. ‘గోకుల్‌ మిషన్‌’ పేరుతో అమల్లోకి రానున్న ఈ ప్రత్యేక పథకానికి రూ.750కోట్లు కేటాయించారు. గో ఉత్పాదకత పెంచడమే లక్ష్యంగా రాష్ట్రీయ కామధేన్‌ ఆయోగ్‌ ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా నాణ్యమైన ఉత్తమజాతి ఆవుల ఉత్పత్తికి కృషి చేయనున్నారు. ఆవుల సంక్షేమాన్ని కూడా రాష్ట్రీయ కామధేన్‌ ఆయోగ్‌ పర్యవేక్షించనుంది.

మత్స్య పరిశ్రమను ఆదుకునేందుకు..
సాధారణ రైతులతో పాటు, పశు పోషణ, మత్స్య పరిశ్రమ రైతులకూ కిసాన్‌ క్రెడిట్‌ కార్డును అందిస్తూ గత బడ్జెట్‌లో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు వారికి మరికొంత ఊరట కలిగించే నిర్ణయాన్ని ఆర్థిక మంత్రి తీసుకున్నారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా పశుపోషణ, మత్స్యపరిశ్రమ రైతులు జరిపే లావాదేవీలపై 2శాతం వడ్డీ రాయితీని గోయల్‌ ప్రకటించారు. అదే విధంగా ఆయా రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే, అదనంగా మరో 3శాతం వడ్డీ రాయితీ కూడా లభించనుంది.

వ్యవసాయ రుణాలపై..
రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలపైనా ఆర్థిక మంత్రి కరుణ చూపారు. ప్రకృతి వైపరీత్యాలు, ఆందోళనల కారణంగా రుణాలు చెల్లించడంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గోయల్‌ అన్నారు. మొదటి సంవత్సరం రుణాల రీ షెడ్యూల్‌ చేసుకున్న రైతులకు ప్రస్తుతం 2శాతం వడ్డీ రాయితీ లభించనుంది. ఇక నుంచి ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయి, ఎన్డీఆర్‌ఎఫ్‌ ధ్రువీకరించిన రైతులకు రుణంలో 2శాతం రాయితీతో పాటు, 3శాతం వడ్డీ రాయితీని కూడా ఇవ్వనున్నారు.