Spread the love

పెట్టుబడులు తగ్గి దళారీ వ్యవస్థకు తావు లేనప్పుడే రైతులు లాభపడతారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఉపరాష్ట్రపతితో మంగళవారం ఉదయం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, పద్మశ్రీ సుభాష్ పాలేకర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు విజయ్ కుమార్ సమావేశ మయ్యారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అనుసరించాల్సిన పద్దతులపై దేశవ్యాప్త సంప్రదింపుల్లో భాగంగా వారు వెంకయ్యనాయుడితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రకృతి వ్యవసాయం, జీరో బడ్జెటింగ్ నేచురల్ ఫార్మింగ్‌పై జరిగిన నీతి ఆయోగ్ సమావేశం గురించి గవర్నర్ ఆయనకు వివరించారు. ఈ మధ్యే పుణెలో జరిగిన “లాభసాటి వ్యవసాయం కోసం చేపట్టాల్సిన చర్యలు, విధానాలు’పై జరిగిన జాతీయ సదస్సు విశేషాలను ఉపరాష్ట్రపతి వారితో పంచుకున్నారు. త్వరలో ఇదే అంశం మీద చెన్నైలో మరో సమావేశం జరగనుందని, జాతీయ స్థాయిలో ఢిల్లీలో మరో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టిన రైతుల అనుభవాలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించి, వ్యవసాయదారులతో సమావేశమవుతానని వెంకయ్యనాయుడు తెలిపారు.